యూపీలో ఎన్ కౌంటర్... వకీల్ పాండే సహా మరొకరి కాల్చివేత!

04-03-2021 Thu 09:43
  • నిన్న రాత్రి ఎన్ కౌంటర్
  • ప్రయాగ్ రాజ్ సమీపంలో ఘటన
  • పిస్టళ్లు స్వాధీనం
Uncounter in UP Two Criminals Shoot Dead

కరుడుగట్టిన ఇద్దరు షార్ట్ షూటర్లను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న రాత్రి జరిగిన ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు. ఈ ఘటన ప్రయాగ్ రాజ్ సమీపంలో జరిగింది. మృతి చెందిన క్రిమినల్స్ ను వకీల్ పాండే అలియాస్ రాజీవ్ పాండే, అలియాస్ రాజు, అమ్జాద్ గా గుర్తించారు. వీరిద్దరూ 2013లో జరిగిన వారణాసి డిప్యూటీ జైలర్ అనిల్ కుమార్ త్యాగి హత్య కేసులో ప్రధాన నిందితులని పోలీసు అధికారులు వెల్లడించారు.

ఇద్దరూ మున్నా భజరంగీ, ముఖ్తార్ అన్సారీల తరఫున పనిచేస్తున్నారని, వీరి తలలపై రూ. 50 వేల చొప్పున రివార్డులు ఉన్నాయని అన్నారు. వీరిద్దరి ఆచూకీ గురించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు ప్రయాగ్ రాజ్ డీఎస్పీ నవేందు కుమార్ నేతృత్వంలో రైడ్ కు వెళ్లారని, ఆ సమయంలో ఎన్ కౌంటర్ జరిగిందని వివరించారు. ఎన్ కౌంటర్ తరువాత 30 ఎంఎం, 9 ఎంఎం పిస్టళ్లతో పాటు లైవ్ కాట్రిడ్జ్ లను, ఓ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

గత సంవత్సరంలో బహోదీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ మిశ్రాను వీరిద్దరూ బెదిరిస్తూ, హత్య చేస్తామని ఓ లేఖను పంపడం కలకలం రేపింది. దీంతో విజయ్ మిశ్రా, తనకు సెక్యూరిటీని పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.