కుమార్తె తల నరికి, చేత్తో పట్టుకుని... నడిరోడ్డుపై నడిచిన వ్యక్తి!

04-03-2021 Thu 08:50
  • యూపీలోని పండితారాలో ఘటన
  • వివాహేతర బంధం నడిపిస్తోందని ఆగ్రహం
  • 17 ఏళ్ల కూతురిని చంపేసిన తండ్రి
UP Man Chops his Daughters Head

మహిళలపై నేరాల విషయంలో ముందు నిలిచే రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం జరిగింది. తన 17 సంవత్సరాల కుమార్తె తల నరికిన ఓ తండ్రి, ఆ తలను చేత్తో పట్టుకుని నడి వీధుల్లో తిరగడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు, స్థానికులు వెల్లడించిన సమాచారం ప్రకారం, లక్నోకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండితారా గ్రామానికి చెందిన సర్వేశ్ కుమార్ అనే వ్యక్తి, నరికేసిన ఓ తలను చేత్తో పట్టుకుని నడుస్తుండగా గ్రామస్థులు గమనించారు. ఆ తల ఆయన కుమార్తెదేనని గుర్తించి హతాశులయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న ఇద్దరు పోలీస్ అధికారులు సర్వేశ్ నడుస్తున్న మార్గానికి ఎదురొచ్చి, అడ్డగించారు. వారి మధ్య జరిగిన సంభాషణను వీడియో తీశారు. తొలుత అతని పేరు అడిగి, ఆ తల ఎవరిదని ప్రశ్నించగా, ఏ మాత్రం సంకోచం లేకుండా, అది తన కుమార్తెదని, హత్య చేసింది తాను ఒక్కడినేనని చెప్పాడు.

ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, అందుకే భరించలేక హత్య చేశానని అన్నాడు. ఆపై పోలీసులు నరికిన తల కిందపెట్టి, కూర్చోవాలని సూచించగా, చెప్పినట్టుగానే చేశాడు. మిగతా శరీరభాగం ఇంట్లోనే ఉందని చెప్పాడు.  ఆపై అతన్ని అరెస్ట్ చేసి, స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు, కేసును విచారిస్తున్నామని తెలిపారు.