పెళ్లి అలంకరణ కోసం వెళ్లి... అటు నుంచి అటే పరారైన వధువు!

04-03-2021 Thu 08:38
  • చెన్నై సమీపంలో ఘటన
  • ఈ ఉదయం జరగాల్సిన వివాహం
  • వధువు వెళ్లిపోవడంతో తీవ్ర ఆగ్రహం
Bride Disappered after went to beauty parlour near Chennai

తెల్లవారితే గురువారం అనగా ముహూర్తం. బుధవారం సాయంత్రం రిసెప్షన్ కు ఏర్పాట్లు జరిగిపోయాయి. వరుడు వచ్చి కూర్చున్నాడు. కానీ వధువు మాత్రం రాలేదు. అలంకరణ నిమిత్తం బ్యూటీ పార్లర్ కు వెళ్లిన ఆమె, ఎంతవరకూ రాకపోయేసరికి వరుడి కుటుంబీకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో వారంతా వివాహ మండపంలోనే రసాభాసకు దిగారు. ఈ ఘటన చెన్నై శివారు ప్రాంతంలోని పూందమల్లి సమీపంలోని చెంబరం పాక్కంలో జరిగింది.

ఈ ఉదయం వధూవరులకు వివాహం జరగాల్సి వుంది. నిన్న రాత్రి ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు రావాల్సిన అమ్మాయి ఎంత సేపటికీ రాలేదు. బ్యూటీ పార్లర్ కు వెళ్లిన ఆమె, అటు నుంచి అటే పరారైనట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వధువు తరఫు బంధువులు కూడా మొహం చాటేశారు. ఆమె కావాలనే పారిపోయిందని భావించిన వరుడి బంధువులు ప్లెక్సీలు, బ్యానర్లు చింపేశారు. తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ, నసరత్ పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసును రిజిస్టర్ చేసుకున్న పోలీసులు యువతి బంధువులను విచారిస్తున్నారు.