Adani group: గంగవరం పోర్టులో 31.5 శాతం వాటా అదానీ చేతికి!

  • విండీ లేక్‌సైడ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌ నుంచి వాటా  
  • ఒక్కో షేరు రూ.120 చొప్పున 16.3 కోట్ల షేర్ల కొనుగోలుకు రెడీ
  • లావాదేవీ విలువ రూ. 1,954 కోట్లు
Adani co to buy stake in Gangavaram Port in AP

విశాఖపట్టణం సమీపంలో ఉన్న గంగవరం పోర్టులో 31.5 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూపు పావులు కదుపుతోంది. ఈ లావాదేవీ విలువ రూ. 1,954 కోట్లు. వార్‌బర్గ్ పింకస్ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్‌సైడ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌ నుంచి ఈ వాటాను కొనుగోలు చేయనున్నట్టు అదానీ గ్రూపు తెలిపింది. ఒక్కో షేరును రూ.120 చొప్పున 16.3 కోట్ల షేర్ల కొనుగోలుకు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. గంగవరం పోర్టు వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు.  

బాగా లోతుగా ఉండే ఈ పోర్టు మొత్తం 1800 ఎకరాల్లో విస్తరించి ఉంది. 9 బెర్తులు ఉన్నాయి. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్, పంచదార, తదితర వాటిని ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటారు. 2019-20లో ఈ పోర్టు నుంచి 3.45 కోట్ల టన్నుల సరుకు రవాణా జరిగింది. ఫలితంగా రూ. 1,082 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

కాగా, ఈ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 10.4 శాతం కాగా, డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి 58.1 శాతం వాటా ఉంది. వార్‌బర్గ్ పింకస్‌కు 31.5 శాతం వాటా ఉండగా, ఇప్పుడు దానిని అదానీ గ్రూపు కొనుగోలు చేయబోతోంది. అంతేకాదు, డీవీఎస్ రాజు కుటుంబం నుంచి కూడా వాటాలను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News