నాని ‘వి’ సినిమాను అమెజాన్ నుంచి తొలగించండి: బాంబే హైకోర్టు 

04-03-2021 Thu 07:52
  • సినిమాలో కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా సాక్షి మాలిక్ ఫొటో
  • తన పరువుకు భంగం కలిగించారంటూ పరువునష్టం దావా
  • ఇది ముమ్మాటికి పరువుకు భంగం కలిగించడమేనన్న ధర్మాసనం
Bombay HC orders Amazon Prime to take down V for illicit use of Sakshi Maliks image

‘అమెజాన్ ప్రైమ్’లో విడుదలైన నాని సినిమా ‘వి’లో అనుమతి లేకుండా తన ఫొటోను వాడారంటూ బాలీవుడ్ నటి సాక్షి మాలిక్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. చిత్ర నిర్మాతలపై పరువునష్టం కేసు వేశారు. ఈ సినిమాలో ఓ సందర్భంలో మొబైల్ ఫోన్‌లో చూపించే కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా తన ఫొటోను చూపించారని, అనుమతి లేకుండా ఆ ఫొటోను వాడి తన పరువుకు భంగం కలిగించారని సాక్షి మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విచారణ జరిపిన న్యాయస్థానం ‘ఇది ముమ్మాటికీ పరువు నష్టం కలిగించే అంశమే’నని వ్యాఖ్యానించింది. ఓటీటీ నుంచి దీనిని వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఫొటోను బ్లర్ చేయడం లాంటివి కాకుండా పూర్తిగా తొలగించాలని పేర్కొన్న ధర్మాసనం, 24 గంటల్లో సినిమాను తొలగించాలని ఆదేశించింది.

సినిమాకు సంబంధం లేని వారి ఫొటోలను వాడడం చట్ట విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో స్పందించిన చిత్ర నిర్మాతలు సాక్షి మాలిక్ ఫొటోను ఉపయోగించిన సన్నివేశాన్ని తొలగించిన తర్వాత మళ్లీ విడుదల చేస్తామని కోర్టుకు విన్నవించారు.