Sasikala: శశికళ అస్త్రసన్యాసం వెనుక బీజేపీ... తమిళనాట ఎడతెగని చర్చ!

BJP Key Role behind Sasikala Desission
  • రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు శశికళ ప్రకటన 
  • తమిళనాట సంచలనం సృష్టించిన ఆమె వ్యాఖ్యలు
  • గత నెలలోనే డీల్ కుదిరిపోయిందని కామెంట్లు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా, చిన్నమ్మగా పరిచయమై, రాష్ట్ర రాజకీయాలను మరో మలుపు తిప్పుతారన్న అభిప్రాయాన్ని తన క్యాడర్ లో కల్పించి, ఆపై అర్థాంతరంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని నిన్న రాత్రి శశికళ చేసిన ప్రకటన తీవ్ర సంచలనం సృష్టించింది.

నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం గత నెలలో ఆమె విడుదలైన వేళ, అన్నాడీఎంకేలోని ఓ వర్గం తిరిగి తమకు మంచిరోజులు వస్తాయని భావించింది. ఆమె దగ్గరి బంధువు టీటీవీ దినకరన్, ఏకంగా తానే సీఎంను అవుతానన్న ధీమాను కూడా వ్యక్తం చేశారు. అయితే, అనూహ్యంగా తాను ఇక రాజకీయాల్లో ఉండబోనని ఆమె స్పష్టం చేయడం తమిళనాడు ప్రజలను షాక్ నకు గురి చేసింది.

ఇంత సంచలన నిర్ణయాన్ని శశికళ తీసుకోవడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని ఇప్పుడు తమిళనాడులో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుందని, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మరోమారు అధికారంలోకి వస్తుందని ఇప్పటికే ఒపీనియన్ పోల్ సర్వేలు వెల్లడించాయి. ఈ దశలో శశికళ తిరిగి రాజకీయాల్లో కొనసాగితే అన్నాడీఎంకేలో చీలిక రావడం ఖాయమని భావించిన బీజేపీ, అన్నాడీఎంకే విడిపోకుండా ఉండాలంటే, తాత్కాలికంగానైనా శశికళను రాజకీయాలకు దూరంగా ఉంచాలని భావించినట్టు వార్తలు వస్తున్నాయి.

గత నెలలో అమిత్ షా తమిళనాడులో పర్యటించిన సమయంలోనే శశికళతో డీల్ కుదిరిపోయిందని తమిళనాడు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. అందులో భాగంగానే ఆమె ఈ ప్రకటన చేశారని అంటున్నారు. అదే నిజమైతే, ఎన్డీయే నేతృత్వంలో అన్నాడీఎంకే తిరిగి తమిళనాడులో అధికారంలోకి వస్తే చాలని భావిస్తున్న బీజేపీ, ఆ మేరకు ప్రస్తుతానికి విజయవంతం అయినట్టే. ఇక కాంగ్రెస్ వెన్నుదన్నుగా ఉన్న డీఎంకే మాత్రం పరిస్థితి ఏదైనా, ఎవరు బరిలో ఉన్నా గెలుపు మాత్రం తమదేనని ఘంటాపథంగా చెబుతోంది.

కాగా, దివంగత జయలలిత అధికారంలో ఉన్నప్పుడుగానీ, పదవిలో లేనప్పుడుగానీ తాను ఎన్నడూ అధికారం, పదవుల కోసం పాకులాడలేదని, ఆమె మరణించిన తరువాత కూడా తనకు ఎటువంటి పదవీకాంక్ష లేదని నిన్న శశికళ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమ్మ (జయలలిత) స్థాపించిన ఏఐఏడీఎంకే మరో మారు గెలవాలన్నదే తన కోరికని కూడా ఆమె వ్యాఖ్యానించారు.
Sasikala
Tamilnadu
BJP
AIADMK

More Telugu News