అమెరికాలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్తానన్న భార్య.. చంపేసి, ఆత్మహత్య చేసుకున్న భర్త

04-03-2021 Thu 06:57
  • కుమార్తె వద్దకు వెళ్లే విషయంలో మనస్పర్థలు
  • తర్వాత చూద్దామన్నా ఒప్పుకోని భార్య
  • భార్యను నరికి చంపి, పురుగుల మందు తాగిన భర్త
Husband killed wife in khammam dist

అమెరికా వెళ్లే విషయంలో తలెత్తిన మనస్పర్థలు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. తర్వాత చూద్దామని చెప్పినా వినిపించుకోని భార్యను కత్తితో నరికి చంపిన భర్త, ఆపై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. తల్లాడ మండలంలోని రంగంబంజర గ్రామానికి చెందిన సంక్రాంతి సుబ్రహ్మణ్యేశ్వరరావు (65), విజయలక్ష్మి (60) భార్యాభర్తలు. నిజానికి వీరిది కృష్ణా జిల్లాలోని పెద్దపాలపర్రు కాగా, 30 ఏళ్ల క్రితం రంగంబంజర వచ్చి స్థిరపడ్డారు.

వీరి ఇద్దరి కుమార్తెల్లో పెద్దమ్మాయి సరిత రామగుండంలో ఉంటున్నారు. చిన్నమ్మాయి సునీత అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సునీత వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్న విజయలక్ష్మి వీసా రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఈ నెల 21 లోపు అమెరికా వెళ్లేవారు.

అయితే, భార్య అమెరికా వెళ్లడం భర్త సుబ్రహ్మణ్యేశ్వరరావుకు ఇష్టం లేకపోవడంతో తర్వాత చూద్దామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో క్షణికావేశానికి గురైన సుబ్రహ్మణ్యేశ్వరరావు కత్తితో భార్యను నరికి చంపాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

నిన్న ఉదయం పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి కొన ఊపిరితో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరరావును చూసి స్థానికులకు చెప్పాడు. వారు వెంటనే 108 వాహనంలో కల్లూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.