శ్రీశైలంలో 25 మంది అనంతపురం భక్తులకు అస్వస్థత

04-03-2021 Thu 06:37
  • దర్శనానికి అనంతపురం జిల్లా నుంచి 120 మంది భక్తులు
  • వెంట తెచ్చుకున్న ఆహారాన్ని తీసుకున్న వైనం
  • ఆ తర్వాత కాసేపటికే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి
25 devotees hospitalized after having food in Srisailam

శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వచ్చిన అనంతపురం భక్తుల్లో 25 మంది అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని ఎల్లనూరు మండలం నెరజాం గ్రామానికి చెందిన 120 మంది భక్తులు నిన్న శ్రీశైలం వచ్చి భ్రమరాంభ, మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. తాము వెంట తెచ్చుకున్న ఆహారాన్ని రాత్రి తిని నిద్రపోయారు.

ఆ తర్వాత కాసేపటికే వారిలో కొందరు తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో బాధపడ్డారు. బాధితులు 25 మందిని వెంటనే సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆహారం విషపూరితం కావడం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.