కమాండ్ కంట్రోల్ కేంద్రంపై ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.. విజయవాడ నుంచి విశాఖకు తరలింపు!

04-03-2021 Thu 06:17
  • రూ.13.80 కోట్లతో విజయవాడలో నిర్మించాలని తొలుత నిర్ణయం
  • విశాఖలో నిర్మించాలంటూ నిన్న ఉత్తర్వులు
  • పాలనా అనుమతులు జారీ చేసిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి
AP Govt decided to build Police command control center in Vizag

విజయవాడలో నిర్మించతలపెట్టిన పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని విశాఖకు తరలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 13.80 కోట్ల వ్యయంతో విజయవాడలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. దీనికి అనుమతులు కూడా మంజూరయ్యాయి. అయితే, నిన్న ఒక్కసారిగా ప్రభుత్వ నిర్ణయం మారిపోయింది.

విశాఖపట్టణంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని నిర్మించాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అనూహ్యంగా పాలనా అనుమతులు మంజూరు చేశారు. మూడు రాజధానుల అంశం ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.