కన్నడ మంత్రి రాసలీలల వీడియో వ్యవహారంలో కొత్త కోణం!

03-03-2021 Wed 22:23
  • మంత్రి రమేశ్ జర్కిహోళిపై మహిళ ఫిర్యాదు
  • ఉద్యోగం ఇస్తానంటూ రాసలీలలు
  • వీడియో వైరల్
  • వీడియోలో సంచలన సంభాషణ
  • సీఎంను అవినీతిపరుడున్న మంత్రి!
  • సిద్ధరామయ్యపై ప్రశంసలు!
New dimension in Karnataka minister scandal

కర్ణాటక జలవనరుల మంత్రి రమేశ్ జర్కిహోళి రాసలీలల వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగం పేరిట తనను లోబర్చుకున్నాడంటూ ఓ మహిళ రమేశ్ జర్కిహోళిపై ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి వీడియో క్లిప్పింగులు బయటికి రావడంతో రమేశ్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆ వీడియో క్లిప్పింగుల్లో రమేశ్ జర్కిహోళి సీఎం యడియూరప్పపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు కన్నడనాట ప్రచారం జరుగుతోంది.

యడియూరప్పపై విమర్శలు చేయడమే కాకుండా, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యపై ప్రశంసలు కురిపించడం ఆ రాసలీలల వీడియోలో దర్శనమిచ్చినట్టు తెలిసింది. యడియూరప్ప చాలా అవినీతికి పాల్పడ్డాడని, సిద్ధరామయ్య మంచివాడని జర్కిహోళి సదరు మహిళతో అన్నట్టు జాతీయ మీడియా పేర్కొంది.

కాగా, రాసలీలల వీడియో టేపులోని సంభాషణలు బహిర్గతం కావడంతో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. ఇది సెక్స్ కుంభకోణం మాత్రమే కాదని, సీఎం పెద్ద అవినీతిపరుడని మంత్రే స్వయంగా అంటున్నాడని ఆరోపించారు. దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బంతి ఇప్పుడు బీజేపీ కోర్టులోనే ఉందని, బీజేపీ సరైన నిర్ణయమే తీసుకుంటుందని భావిస్తున్నానని శివకుమార్ అభిప్రాయపడ్డారు.