పోస్టుమార్టం చేయబోతుండగా బతికాడు... కర్ణాటకలో ఘటన!

03-03-2021 Wed 22:07
  • రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు
  • ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
  • చనిపోయాడంటూ వెంటిలేటర్ తొలగించిన వైద్యులు
  • పోస్టుమార్టం కోసం దేహం ప్రభుత్వాసుపత్రికి తరలింపు
  • యువకుడి శరీరంలో కదలికలు గుర్తించిన బంధువులు
Youth gets life on Post martem table in Karanataka

కర్ణాటకలో విస్మయం కలిగించే సంఘటన చోటుచేసుకుంది. చనిపోయాడనుకుని పోస్టుమార్టం చేయబోతుండగా ఓ యువకుడిలో కదలిక కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మహాలింగపూర్ కు చెందిన 27 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉన్న దశలో అతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స ప్రారంభించిన వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. అయితే కొద్దిసేపటికే అతడు చనిపోయాడంటూ డాక్టర్లు ప్రకటించారు. దాంతో ఆ యువకుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇక, అతడి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టం ప్రారంభించబోతుండగా ఆ యువకుడి దేహంలో కదలిక కనిపించింది. ఇది గమనించిన ఆ యువకుడి బంధువులు వైద్యులకు ఈ విషయం తెలిపారు. దాంతో అతడిని హుటాహుటీన మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నట్టు తెలిసింది.

దీనిపై ప్రభుత్వాసుపత్రి వర్గాలు స్పందిస్తూ, ఆ యువకుడికి మొదట చికిత్స అందించిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు తప్పుడు నిర్ణయం వెలిబుచ్చారని, బతికున్నవాడికి వెంటిలేటర్ తీసేసి చనిపోయాడని చెప్పారని పేర్కొన్నారు.