భారీ రేటుకి 'ఆర్ఆర్ఆర్' డిజిటల్ రైట్స్!

03-03-2021 Wed 21:43
  • ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'
  • రికార్డు స్థాయిలో థియేట్రికల్ హక్కులు
  • డిస్నీ హాట్ స్టార్ కు ఓటీటీ హక్కులు
  • 200 కోట్లకు అమ్ముడు పోయిన రైట్స్    
RRR digital rights sold for a bomb

'బాహుబలి' తర్వాత దర్శకుడిగా రాజమౌళి స్థాయి ఎంతగానో పెరిగిపోయింది. అందుకు తగ్గట్టుగానే ఆయన చిత్రాల నిర్మాణ వ్యయం కూడా పెరిగింది. ఆయన సినిమాలకు అంతర్జాతీయ స్థాయి మార్కెట్  ఏర్పడడంతో బడ్జెట్టు వందల కోట్లకు వెళ్లిపోయింది. ఇప్పుడు ఆయన తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్' విషయంలో అదే జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది.

'ఆర్ఆర్ఆర్'ను అసలుసిసలు మల్టీ స్టారర్ గా చెప్పుకోవచ్చు. తెలుగులో స్టార్ హీరోలుగా రాణిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ బిజీ స్టార్ అలియా భట్ ఓ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో చిత్ర నిర్మాణానికి సుమారు 400 కోట్లు అవుతున్నట్టు చెబుతున్నారు.

ఈ క్రమంలో బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతోందని అంటున్నారు. ఇప్పటికే థియేట్రికల్ హక్కుల విషయంలో రికార్డు సృష్టిస్తోంది. మరోపక్క తాజాగా డిజిటల్ హక్కులు కూడా భారీ స్థాయిలో అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. స్టార్ నెట్ వర్క్ కు చెందిన డిస్నీ హాట్ స్టార్ ఈ చిత్రం ఓటీటీ హక్కులను సుమారు 200 కోట్లకు సొంతం చేసుకున్నట్టు సమాచారం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల వెర్షన్లను డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేస్తారట.