Corona Vaccine: కోవిన్ పోర్టల్ ద్వారా కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలాగంటే..!

  • భారత్ లో కరోనా వ్యాక్సినేషన్
  • వృద్ధులకు వ్యాక్సిన్ ఇస్తున్న వైనం
  • 45 పైళ్లకు పైబడిన ఇతర వ్యాధిగ్రస్తులకూ వ్యాక్సిన్
  • వ్యాక్సినేషన్ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్
  • ఆరోగ్యసేతు యాప్ ద్వారానూ స్లాట్ బుకింగ్
How to register for corona vaccine through CoWin Portal

భారత్ లో ప్రస్తుతం సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. 60 ఏళ్లకు పైబడిన వారికి, పలు రకాల జబ్బులతో బాధపడుతున్న 45 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అయితే, ఈ వ్యాక్సిన్ అందుకోవడానికి ప్రభుత్వ పోర్టల్ లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కోవిన్ 2.0 పోర్టల్ (www.cowin.gov.in) ద్వారా గానీ, ఆరోగ్యసేతు యాప్ ద్వారా గానీ రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం కల్పించారు.

కోవిన్ ద్వారా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే రిజిస్ట్రేషన్ స్లాట్లు అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు తెరిచి ఉంచేది ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే కావడంతో ఆ సమయంలోనే పోర్టల్ లో రిజిస్ట్రేషన్లు చేసుకునే వీలుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ఉచితంగానే అందిస్తుండగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే బీహార్ లో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా వ్యాక్సిన్ ఉచితమే. అక్కడి ప్రభుత్వమే మొత్తం ఖర్చును భరిస్తోంది.

ఇక కోవిన్ పోర్టల్ ద్వారా ఈ కింది విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి...

  • కోవిన్ పోర్టల్ (www.cowin.gov.in)లో లాగ్ ఆన్ అయి అందులో మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
  • ఎస్సెమ్మెస్ ద్వారా మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది
  • ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై బటన్ పై క్లిక్ చేయాలి.
  • ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పేజ్ ప్రత్యక్షమవుతుంది.
  • రిజిస్ట్రేషన్ పేజ్ లో మీ వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఫొటో ఐడీ ప్రూఫ్ వంటి వివరాలు నమోదు చేయాలి. మీకేమైనా ఇతర జబ్బులు ఉంటే ఆ వివరాలు కూడా వెల్లడించాలి. అన్నింటికి అవును, కాదు అనే ఆప్షన్లపై క్లిక్ చేయాలి.
  • అన్ని వివరాలు పొందుపరిచిన తర్వాత కిందిభాగంలో కుడివైపున ఉన్న రిజిస్టర్ అనే బటన్ పై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ విజయవంతం అయిందంటూ మీ మొబైల్ కు ఓ సందేశం వస్తుంది.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక అకౌంట్ డీటెయిల్స్ పేజ్ ప్రత్యక్షమవుతుంది. అందులో మీరు ఏ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ మేరకు అపాయింట్ మెంట్ సమయం నమోదు చేసుకోవచ్చు. అందుకోసం షెడ్యూల్ అపాయింట్ మెంట్ అనే బటన్ పై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు తమతో పాటు మరో ముగ్గురిని కూడా అదే మొబైల్ నెంబరుపై లింక్ చేసే సౌలభ్యం కోవిన్ పోర్టల్ కల్పిస్తోంది.
  • కిందిభాగంలో కుడివైపున ఉండే యాడ్ మోర్ అనే బటన్ ను క్లిక్ చేసి ఆ ముగ్గురి వివరాలు నమోదు చేసి ఎంటర్ నొక్కితే సరి.
  • పోర్టల్ ద్వారానే కాకుండా ఆరోగ్యసేతు యాప్ ద్వారా కూడా వ్యాక్సినేషన్ స్లాట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో ప్రత్యేకంగా వ్యాక్సిన్ కోసం ఓ ట్యాబ్ ఏర్పాటు చేశారు. పేరు, వయసు తదితర వివరాలు నమోదు చేసి స్లాల్ బుక్ చేసుకోవచ్చు.

More Telugu News