Tamil Nadu: తమిళనాడు ఎన్నికల బరిలోకి ఎంఐఎం.. డీఎంకేతో పొత్తుకు సై!

  • 22 స్థానాల్లో పోటీ చేస్తామన్న ఎంఐఎం తమిళనాడు చీఫ్
  • డీఎంకేతో పొత్తు కుదరకుంటే ఒంటరిగా బరిలోకి
  • ఇప్పటికే 11 స్థానాలు గుర్తించామన్న వకీల్ అహ్మద్
MIM Ready to contest in Tamil Nadu Assembly Polls

తెలంగాణకు ఆవల పార్టీని విస్తరిస్తున్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తమిళనాడులోనూ పోటీకి సై అంటున్నారు. త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బరిలోకి దిగేందుకు సమయాత్తం అవుతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ప్రకటించారు. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు కొందరు గెలుపొందారని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోనూ తమ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు చెప్పారు.

డీఎంకేతో కలిసి బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు ఆ పార్టీ తమిళనాడు చీఫ్ వకీల్ అహ్మద్ తెలిపారు. పొత్తుకు ఆ పార్టీ విముఖత చూపితే ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం తమకు బలమున్న 22 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించామని, అందులో భాగంగా ఇప్పటికే 11 స్థానాలను గుర్తించామని వకీల్ అహ్మద్ తెలిపారు.  

ఇటీవల బీహార్‌లో పోటీ చేసిన ఎంఐఎం.. పశ్చిమ బెంగాల్‌లోనూ సత్తా చాటాలని నిర్ణయించింది. తృణమూల్‌తో కలిసి బరిలోకి దిగాలని భావిస్తున్నా మమత అందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని అసద్ నిర్ణయించినట్టు సమాచారం. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6న ఒకే విడతలో జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.

More Telugu News