పిచ్ ల గురించి పట్టించుకోం కాబట్టే మేం విజయవంతం అవుతున్నాం: కోహ్లీ

03-03-2021 Wed 19:50
  • భారత్, ఇంగ్లండ్ సిరీస్ లో చర్చనీయాంశంగా పిచ్ లు
  • తక్కువ రోజుల్లోనే ముగిసిన టెస్టులు
  • దారుణమైన పిచ్ లు అంటూ ఇంగ్లండ్ మాజీల విమర్శలు
  • పేస్ పిచ్ లపై ఎందుకు మాట్లాడరన్న కోహ్లీ
Kohli joins the ongoing discussion about spinning tracks

భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ సందర్భంగా పిచ్ ల గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది కూడా స్పిన్ పిచ్ పైనే అయినా, ఆ తర్వాత వరుసగా ఆ జట్టు రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిపోవడంతో పిచ్ లపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు పిచ్ లపై దారుణమైన రీతిలో స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో, టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

స్పిన్ కు అనుకూలించే పిచ్ లు తరచుగా చర్చనీయాంశం అవుతున్నాయని అంగీకరించాడు. అయితే స్పిన్ పిచ్ పై మూడ్రోజుల్లోనే మ్యాచ్ ముగిసినప్పుడు వినిపిస్తున్న గొంతుకలు... పేస్ పిచ్ లపై తక్కువ రోజుల్లోనే మ్యాచ్ ముగిసినప్పుడు వినిపించడంలేదని విమర్శించాడు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను తాను గౌరవిస్తానని, కానీ కేవలం స్పిన్ పిచ్ ల విషయంలోనే విమర్శలు చేయడం సరికాదని స్పష్టం చేశాడు.

న్యూజిలాండ్ లో తాము ఓ టెస్టులో మూడో రోజు ఆటలో 36 ఓవర్లలోనే మ్యాచ్ ను కోల్పోయామని వెల్లడించాడు. అయితే భారత్ కు చెందినవాళ్లెవరూ ఆ పిచ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తాను కచ్చితంగా చెప్పగలనని కోహ్లీ అన్నాడు. ఆ సమయంలో న్యూజిలాండ్ గడ్డపై భారత్ ఎంత చెత్తగా ఆడిందన్నదే చూస్తారని, అక్కడి పిచ్ లను మాత్రం ఎవరూ తప్పుబట్టరని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ పిచ్ లపై ఎంత గడ్డి ఉంది? బంతి ఎలా స్వింగ్ అవుతోంది? బంతి ఎలా దూసుకెళుతోంది? అనేది ఎవరూ చూడరని వివరించాడు.

అయితే, పిచ్ ఎలా ఉన్నా తాము పట్టించుకోమని, అదే టీమిండియా విజయాలకు కారణమని కోహ్లీ స్పష్టం చేశాడు. ఇప్పటివరకు ఆ విధమైన దృక్పథాన్నే అనుసరిస్తున్నామని, ఇకపైనా ఓ జట్టుగా అదే పంథాలో నడుస్తామని తెలిపాడు.