Ganta Srinivasa Rao: నాపై 100 సార్లకు పైగా ఇలాంటి వార్తలు వచ్చాయి... ఈసారి విజయసాయిరెడ్డే సమాధానం చెప్పాలి: గంటా

Ganta Srinivasarao clarifies over Vijayasai Reddy comments
  • గంటా వైసీపీలో చేరుతున్నాడంటూ విజయసాయి వెల్లడి
  • తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైనం
  • ఇలాంటి ప్రచారం కొత్తేమీ కాదన్న గంటా
  • వాటిని ఖండిస్తూనే ఉన్నానని వెల్లడి
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తున్నాడంటూ సాక్షాత్తు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వెల్లడించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త అన్ని మీడియా చానళ్లలో ప్రసారమైంది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు స్పందించారు. తనపై ఇలాంటి వార్తలు రావడం కొత్తేమీ కాదని తెలిపారు.

2019 ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలోనూ, ఎన్నికల తర్వాత కూడా వచ్చాయని వివరించారు. తనపై ఇప్పటివరకు 100 సార్లకు పైగా ఇలాంటి ప్రచారం జరిగిందని, కొన్నిసార్లు వైసీపీలో చేరుతున్నట్టు తేదీలు, ముహూర్తాలు కూడా ప్రకటించేశారని వెల్లడించారు. ఒకసారి బీజేపీలో చేరుతున్నట్టు కూడా ప్రచారం చేశారని, కాదు కాదు వైసీపీలో చేరుతున్నాడంటూ ప్రచారం చేశారని వివరించారు. తనపై ఇలాంటి వార్తలు ఎప్పట్నించో వస్తున్నాయని, తాను వాటిని ఖండిస్తూనే ఉన్నానని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

కానీ, ఉన్నట్టుండి విజయసాయిరెడ్డి ఎటువంటి ఉద్దేశంతో ఇవాళ్టి వ్యాఖ్యలు చేశారో అర్థం కావడంలేదని తెలిపారు. పార్టీలో చేరేందుకు తాను ఎలాంటి ప్రతిపాదనలు పంపానో విజయసాయిరెడ్డే సమాధానం చెప్పాలని గంటా స్పష్టం చేశారు.
Ganta Srinivasa Rao
Vijay Sai Reddy
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News