బీఎంఐ అధికంగా ఉన్నవాళ్లే కరోనాను ఎక్కువగా వ్యాప్తి చేస్తున్నారట!

03-03-2021 Wed 19:17
  • ఏడాదికి పైగా కరోనా విజృంభణ
  • అనేక దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్
  • అదే సమయంలో కరోనాపై అధ్యయనాలు
  • తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశం వెల్లడి
People with higher BMI causes corona virus heavy spreading

ఇన్నాళ్లు తమను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని పారదోలేందుకు ప్రపంచదేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా అమలు చేస్తున్నాయి. ఓవైపు కరోనా కొత్త స్ట్రెయిన్ లు వ్యాప్తి చెందుతుండగా, మరోవైపు ప్రజలకు టీకాలు అందించడం వేగం పుంజుకుంది.

 ఈ క్రమంలో ఓ ఆసక్తికర అధ్యయనం తెరపైకి వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తికి ఎవరు ఎక్కువ కారకులు అవుతున్నారన్నదానిపై నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ప్రచురితమైన ఓ అధ్యయనం వివరాలు అందించింది.

సాధారణంగా కరోనా రోగిని తాకినా, ఆ రోగి ముక్కు, నోటి నుంచి వెలువడిన తుంపరలను పీల్చినా, వైరస్ ఉన్న ఉపరితలాలను తాకినా వైరస్ బారినపడతారు. కొందరు వ్యక్తులు పెద్ద సంఖ్యలో ప్రజలు కరోనా బారినపడడానికి కారకులైనప్పుడు వారిని సూపర్ స్ప్రెడర్స్ అంటారు.

అయితే, ఇతరులతో పోల్చితే ఆ సూపర్ స్ప్రెడర్స్ లో భిన్నత్వం ఏంటన్నది తాజా అధ్యయం విశదీకరిస్తోంది. ఊబకాయంతో బాధపడుతూ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అధికంగా ఉన్న వ్యక్తులే కరోనాను అధికంగా వ్యాప్తి చేస్తున్నారని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు.

అధిక బరువు ఉన్నవాళ్లు శ్వాస తీసుకునే రేటు అధికంగా ఉంటుందని, వారిలో ఉఛ్వాస నిశ్వాసలు అధికంగా ఉండడంతో వారి ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపరలు విస్తృతంగా వాతావరణంలో కలుస్తుంటాయని తెలిపారు. బీఎంఐ అధికంగా ఉన్న 194 మందిపై పరిశోధన జరిపి ఈ నిర్ణయానికి వచ్చారు. బీఎంఐ అధికంగా ఉన్న వృద్ధులకు కరోనాతో ముప్పు ఎక్కువని గుర్తించారు.