తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. షర్మిల పార్టీలోకి ఇందిరా శోభన్

03-03-2021 Wed 18:57
  • రెండు రోజుల క్రితం షర్మిల అనుచరులతో సమావేశం
  • నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
  • సోనియాపై గౌరవంతోనే పార్టీలో కొనసాగానన్న ఇందిర
Congress senior leader Indira Shobhan quits congress

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండు రోజుల క్రితం వైఎస్ షర్మిల అనుచరులతో సమావేశమైన కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరా శోభన్ నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. షర్మిల త్వరలో పెట్టనున్న పార్టీలో ఆమె చేరే అవకాశం ఉందని సమాచారం.

కాగా, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఇందిరా శోభన్ ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీపై అభిమానంతోనే తాను ఇంతకాలం పార్టీలో కొనసాగినట్టు చెప్పారు. ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేశానని అన్నారు. అయితే, గత కొన్ని రోజులుగా పార్టీ సీనియర్ నేతలు వ్యవహరిస్తున్న తీరు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని, అందుకే పార్టీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. పార్టీలో మహిళలకు కనీస ప్రాధాన్యం కూడా లేదని ఇందిరా శోభన్ ఆవేదన వ్యక్తం చేశారు.