ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో ఆప్ స్వీప్.. బీజేపీకి ఘోర పరాభవం!

03-03-2021 Wed 18:22
  • ఐదు వార్డులకు గాను నాలుగింటిలో విజయం
  • ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్
  • 15 ఏళ్లు పాలించిన బీజేపీకి ‘సున్నా’
AAP Sweeps Delhi MCD Bypolls

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లోని 5 వార్డులకు గత నెల 28న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఐదు వార్డుల్లో నాలుగింటిని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలుచుకోగా, ఓ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. 15 ఏళ్లపాటు ఎంసీడీని పాలించిన బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారనడానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు.

అదే సమయంలో బీజేపీపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ వ్యవహరించిన తీరు నచ్చకే ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. ఎంసీడీని 15 ఏళ్లపాటు పాలించిన బీజేపీ దానిని అవినీతి శాఖగా మార్చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. దానిని ప్రక్షాళన చేయాలనే ప్రజలు తమను గెలిపించారని అన్నారు.