పంజా విసురుతున్న రాణిఖేత్!... పెద్దపల్లి జిల్లాలో 3,600 కోళ్లు మృత్యువాత

03-03-2021 Wed 18:22
  • పెద్దంపేట్ గ్రామంలో ఓ పౌల్ట్రీ ఫాంలో రాలిపోతున్న కోళ్లు
  • 4 రోజుల వ్యవధిలో వేల కోళ్లు మృతి
  • ప్రాణాంతక వైరస్ కారణం అయ్యుంటుందన్న అధికారులు
  • నమూనాలు పరీక్షకు పంపిస్తున్నట్టు వెల్లడి
Thousands of birds died in a poultry farm at Peddampet

పెద్దపల్లి జిల్లాలో 3,600 కోళ్లు మృత్యువాత పడిన అంశం కలకలం రేపుతోంది. కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దంపేట్ గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫాంలో గత నాలుగు రోజుల వ్యవధిలోనే ఇన్ని కోళ్లు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై జిల్లా వెటర్నరీ అధికారి నారాయణ స్పందిస్తూ, పెద్ద సంఖ్యలో కోళ్లు మరణించడానికి రాణిఖేత్ వ్యాధి కారణం అయ్యుంటుందని అభిప్రాయపడ్డారు.

వైరస్ ప్రభావంతో సంభవించే ఈ వ్యాధి చాలా వేగంగా వ్యాపించడమే కాకుండా, కోళ్ల పాలిట ప్రాణాంతకం అని వివరించారు. కాగా, కోళ్లు మృత్యువాత పడుతున్న పౌల్ట్రీ ఫాం నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపిస్తున్నామని తెలిపారు.