బీజేపీకి వంద సీట్ల పైనొస్తే.. ఇక నేను తప్పుకొంటా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్

03-03-2021 Wed 13:58
  • బెంగాల్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు
  • మళ్లీ మమతదే అధికారమని తేల్చి చెప్పిన పీకే
  • తృణమూల్ తనంతట తాను పతనమైతే తప్ప బీజేపీ గెలవదు
  • విభేదాలను కాషాయ పార్టీ సొమ్ము చేసుకుంటోంది
  • పదవులు, సొమ్ములు ఎరవేసి నేతలను చేర్చుకుంటోంది
Will cease to exist as political strategist if BJP wins over 100 seats in Bengal Prashant Kishor

పశ్చిమ బెంగాల్ లో వచ్చేది మమత ప్రభుత్వమేనని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ వ్యూహకర్తగా తప్పుకుంటానని, వేరే పని చూసుకుంటానని అన్నారు. ‘‘బీజేపీకి వందకుపైగా సీట్లొస్తే నేను నా పని వదిలేస్తా. ఐపీఏసీనీ వదిలి వెళ్లిపోతా’’ అని అన్నారు. బుధవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను అన్నది జరగకపోతే భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకీ సలహాలు సూచనలు ఇవ్వనని చెప్పారు. ‘‘ఉత్తరప్రదేశ్ లో మా అంచనాలు తప్పాయి. మేం ఓడిపోయాం. మేం అనుకున్నది చేయలేకపోయాం. కానీ, బెంగాల్ లో అలాంటి పరిస్థితి లేదు. గెలిచేందుకు చేయాల్సిందంతా నేను చేస్తున్నాను. ఆ విషయంలో దీదీ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఒకవేళ బెంగాల్ లో ఓడిపోతే ఆ పనికి అసమర్థుడినని నేను ఒప్పుకొంటా’’ అని ఆయన అన్నారు.

బెంగాల్ లో 200 సీట్లు గెలుస్తామని అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని, అది కేవలం తృణమూల్ పార్టీ నేతల్లో భయం సృష్టించడానికేనని అన్నారు. బీజేపీ గెలుస్తుందన్న ప్రచారం చేయడానికేనన్నారు. ప్రధాని మోదీ తప్ప వారి సభలు, సమావేశాలకు కనీసం 200 నుంచి 300 మంది జనాలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ తనంతట తాను పతనమైతే తప్ప బెంగాల్ లో బీజేపీ గెలవలేదని స్పష్టం చేశారు. తృణమూల్ పార్టీలో అంతర్గత విభేదాలున్నాయని, వాటిని బీజేపీ సొమ్ము చేసుకుంటోందని అన్నారు. తృణమూల్ నుంచి భారీగా వలసలు పెరుగుతాయన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ఇది వారి వ్యూహాల్లో ఒకటని అన్నారు. ఇతర పార్టీల నేతలకు ఎరవేసి లాక్కుంటారని ఆరోపించారు. వారికి పదవులు, టికెట్లు, డబ్బు ఆశజూపి పార్టీలోకి ఆకర్షిస్తారని అన్నారు.

తన వల్లే పార్టీ నుంచి నేతలు వెళ్లిపోతున్నారన్న వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. తాను పనిచేస్తున్నది స్నేహితులను చేసుకోవడానికి కాదన్నారు. పార్టీని గెలిపించేందుకు మాత్రమే పనిచేస్తున్నానని చెప్పారు. తన పని తాను చేసుకుపోతున్నప్పుడు కొందరు తమను పక్కనపెడుతున్నారని అనుకోవడంలో తప్పు లేదన్నారు.