ఉద్యోగం వ‌చ్చింద‌ని స్వీట్లు పంచి.. ఇళ్లు దోచేసిన జంట!

03-03-2021 Wed 12:53
  • ఒడిశాలో ఘ‌ట‌న‌
  • ఓ ఇంట్లో అద్దెకు దిగిన జంట‌
  • య‌జ‌మాని ఇంట్లో రూ.35 ల‌క్ష‌ల బంగారం చోరీ
  • మరో ఏడు ఇళ్ల‌లోనూ దొంగ‌తనం.. ప‌రారీ
couple theft in odisha

తమ వీధిలో ఉంటోన్న వారికి మిఠాయిలు పంచి, వారి ఇళ్ల‌లో చోరీకి పాల్ప‌డి పారిపోయింది ఓ జంట‌. సినిమా సీన్‌లా జ‌రిగిన ఈ దొంగ‌త‌నం ఘ‌ట‌న‌ ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని బుట్టిగుడ వీధిలో చోటు చేసుకుంది. ఆ వీధిలో నివ‌సించే ఉషా పటేల్ అనే మ‌హిళ ఇంట్లో సుభాష్‌ దంప‌తులు మూడు నెల‌ల నుంచి అద్దెకు ఉంటున్నారు.

ఉద్యోగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాన‌ని సుభాష్ చెప్పుకునేవాడు. ముంద‌స్తు ప్రణాళిక ప్ర‌కారం రెండు రోజుల క్రితం సాయంత్రం బ‌య‌ట‌కు వెళ్లి ఇంటికి స్వీట్లు ప‌ట్టుకొచ్చాడు. త‌నకు మంచి ఉద్యోగం వచ్చిందని ఇంటి యజమానితో పాటు వీధిలోని చాలా మందికి మ‌త్తు మందు క‌లిపిన‌ స్వీట్లు పంచాడు.

స్వీట్లు తిన్న వారంతా మత్తులోకి జారుకోవ‌డంతో రాత్రి 10 గంటలకు త‌న‌ భార్యతో కలిసి సుభాష్ త‌మ యజమాని ఇంటిలో ఉన్న రూ.35 లక్షల విలువ చేసే బంగారంతో పాటు రూ.2.5 లక్షల నగదును తీసుకున్నాడు. అలాగే, స్వీట్లు తిని ప‌డిపోయిన ఏడు ఇళ్ల‌లోనూ చోరీ చేసి భార్య‌తో కలసి పారిపోయాడు.

నిన్న‌ ఉదయం ఇంటి యజమాని ఉషా పటేల్ మ‌త్తు వ‌దిలాక‌,‌ లేచి చూసి చోరీ జ‌రిగింద‌ని గుర్తించింది. మ‌రో ఏడుగురి ఇళ్ల‌లోనూ చోరీ జ‌ర‌గ‌డంతో వారంతా క‌లిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దంప‌తులుగా చెప్పుకుని ఇళ్లు అద్దెకు తీసుకుని పారిపోయిన సదరు జంట కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు.