డీఎంకేపై గెలవాలంటే... శశికళను ఆహ్వానించాలని అన్నాడీఎంకే నేతలకు సూచించిన అమిత్ షా!

03-03-2021 Wed 12:32
  • శశికళతో చర్చిస్తున్న అన్నాడీఎంకే నేతలు
  • ససేమిరా అంటున్న సీఎం పళనిస్వామి
  • ఆమె వస్తే వర్గ పోరు ఖాయమంటున్న ముఖ్యమంత్రి
  • కానీ తప్పదంటున్న అమిత్ షా 
Amit Shah Told AIADMK that Sasikala Key to win

తమిళనాడులో మరికొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, డీఎంకేను ఎదుర్కోవాలంటే ప్రస్తుతమున్న అన్నాడీఎంకే బలం సరిపోదని భావిస్తున్న ఎన్డీయే, బహిష్కృత నేత, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళను తిరిగి పార్టీలోకి అహ్వానించాలని భావిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నుంచి రాష్ట్ర నేతలతో పాటు, ఎన్నికల ఇన్ చార్జ్ లుగా నియమించబడిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వీకే సింగ్ లకు ఆదేశాలు వచ్చాయని సమాచారం.

అమిత్ షా నుంచి అందిన సంకేతాలతో తిరిగి శశికళను అన్నాడీఎంకేలోకి ఆహ్వానించేందుకు బీజేపీ నేతలు అన్నాడీఎంకే నేతలతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. అయితే, బీజేపీ నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనకు సీఎం పళనిస్వామి తీవ్ర విముఖత వ్యక్తం చేస్తున్నారని, పన్నీరు సెల్వం మాత్రం కాస్తంత సుముఖంగానే ఉన్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

శశికళను తిరిగి ఆహ్వానిస్తే, అన్నాడీఎంకే బలోపేతం అవుతుందన్నది బీజేపీ యోచన. ఆమె రాకుంటే, ఎన్నికల సమయానికి పార్టీలో చీలిక వస్తుందని, ఓట్లు నష్టపోవడం ద్వారా డీఎంకేకు మేలు జరుగుతుందని ఎన్డీయే పెద్దల నుంచి వచ్చిన హెచ్చరికలతో అన్నాడీఎంకేలోని పలువురు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి గత నాలుగేళ్లుగా శశికళ జైల్లో ఉన్నా, ఆమె మద్దతుదారులు అన్నాడీఎంకేలోనే కొనసాగారు. ఇప్పుడు వారంతా శశికళ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో కొందరు మంత్రులు కూడా ఉండటం గమనార్హం. ఆమె వస్తే, పార్టీలో గ్రూపులు కట్డడం ఖాయమని, తన చేతికి అధికారం దక్కదని పళనిస్వామి భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా అమిత్ షా వద్ద ప్రస్తావించారని, అయితే, డీఎంకే జోరును అడ్డుకోవాలంటే, కొన్ని త్యాగాలు తప్పవని ఆయన స్పష్టంగా చెప్పారని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు.