అప్పుడే రేవంత్ వర్గానికి ఎందుకు భయం పట్టుకుంది?: కొండా రాఘవరెడ్డి

03-03-2021 Wed 11:31
  • తెలంగాణలో పార్టీని పెట్టబోతున్న షర్మిల
  • రేవంత్ సైన్యం పేరిట బదిరింపులు
  • డీజీపీని కలవనున్న కొండా రాఘవరెడ్డి
YS Sharmila Serious on Revant Reddy

తెలంగాణలో వైఎస్ఆర్ పాలనను తెస్తానంటూ, రాజకీయ పార్టీని పెట్టేందుకు వైఎస్ షర్మిల నిర్ణయించుకుని, చకచకా అడుగులు వేస్తున్న తరువాత, రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. షర్మిల పార్టీ వైపు రెడ్డి సామాజిక వర్గం నేతలు చూస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే సమయంలో గతంలో తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి అనుచరుల నుంచి తమకు బెదరింపు కాల్స్ వస్తున్నాయని షర్మిల వర్గం ఆరోపిస్తోంది.

ఇప్పటికే రేవంత్ సైన్యం పేరిట తమకు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించిన షర్మిల అనుచరుడు, ఆమె తరఫున మీడియాకు సమాచారం అందిస్తున్న ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, మరికాసేపట్లో డీజీపీని కలవనున్నారు. ఈ మేరకు ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన కొండా, తాను ఇప్పటికే డీజీపీ అపాయింట్ మెంట్ ను తీసుకున్నానని అన్నారు. ఇప్పటివరకూ షర్మిల పార్టీని స్థాపించలేదని గుర్తు చేసిన ఆయన, అప్పుడే రేవంత్ వర్గానికి ఎందుకు భయం పట్టుకుందని ప్రశ్నించారు. వైఎస్ షర్మిల కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఏ విధమైన ఆరోపణలు చేసినా సహించబోయేది లేదని హెచ్చరించారు.

ఈ విషయంలో షర్మిల సైతం స్పష్టమైన అవగాహనతోనే ఉన్నారని, ఆమె ఆదేశాల మేరకే సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై సైబర్ క్రైమ్ దర్యాఫ్తునకు డిమాండ్ చేయనున్నామని కొండా రాఘవరెడ్డి వెల్లడించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఎంతో మంది రెడ్డి సామాజిక వర్గం వారు ఆ పార్టీకి దూరమయ్యారని, రేవంత్ పెడుతున్న హింసను భరించలేకనే వారు పార్టీని వీడారని కొండా ఆరోపిస్తున్నారు.

 వారంతా ప్రస్తుతం షర్మిల వద్దకు వచ్చి తాము ఎదుర్కొన్న అవమానాల గురించి చెబుతున్నారని, ఆ వివరాలన్నీ తాను బయట పెట్టేందుకు సిద్ధమని చెప్పారు. తమను ట్రోల్స్ చేస్తున్న వారిలో ఎవరినీ వదిలి పెట్టబోమని, పూర్తి సాక్ష్యాలతో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నామని అన్నారు. డీజీపీని కలిసి మొత్తం వివరాలను అందిస్తానని అన్నారు.