అర్జెంటీనాలో బయటపడిన 14 కోట్ల సంవత్సరాల నాటి భారీ డైనోసార్ అవశేషాలు

03-03-2021 Wed 10:57
  • 65 అడుగుల పొడవున్న అస్థిపంజరం
  • సైంటిఫిక్ జర్నల్ లో ప్రత్యేక కథనం
  • ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కనిపించిన అవశేషాలు
Fosils of Titanosaurus Found in Argentina

అర్జెంటీనాలోని పాటగోనియన్ ప్రాంతంలో దాదాపు 14 కోట్ల సంవత్సరాల క్రితం జీవించి ఉన్న టిటానోసారస్ డైనోసార్ అవశేషాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది నింజాటిటాన్ జపాటల్ అనే పేరున్న డైనోసార్ జాతికి చెందినదని వెల్లడించారు. న్యూక్వీన్ సిటీ శివార్లలో ఈ రాక్షసబల్లికి చెందిన ఎముకలు లభించాయని తెలిపారు. కాగా, ఈ తరహా టిటానోసారస్ జాతి డైనోసార్ల అవశేషాలు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే లభ్యమయ్యాయని అర్జెంటీనా నేషనల్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ విభాగం ప్రతినిధి పాబ్లో గాలినా వెల్లడించారు.

నిన్జాటిటాన్ సాధారణంగా 20 మీటర్లు (65 అడుగులు) పొడవుంటుందని తెలిపిన ఆయన, అర్జెంటినోసారస్ (115 మీటర్లు) తో పోలిస్తే, చిన్నగా ఉంటుందని అన్నారు. ఈ తాజా అన్వేషణ గురించి సైంటిఫిక్ జర్నల్ 'అమెఘినియన్నా' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సౌరోపాడ్స్ గ్రూపునకు చెందిన అతిపెద్ద డైనోసార్లలో టిటానోసారస్ లు కూడా భాగమేనని, బ్రోనోటోసారస్, డిప్లోడోకస్ లు కూడా ఇవే గ్రూప్ నకు చెందినవని పాబ్లో గాలినా పేర్కొన్నారు.