Rahul Gandhi: ఆనాడు నానమ్మ చేసింది ముమ్మాటికీ తప్పే: అంగీకరించిన రాహుల్ గాంధీ

Rahul Agrees Emergency by Indira is Absolutely Mistake
  • 1975 నుంచి 77 మధ్య ఇండియాలో ఎమర్జెన్సీ
  • ప్రజల హక్కులు హరించుకుపోయాయి
  • అయితే రాజ్యాంగాన్ని ఆక్రమించాలని కాంగ్రెస్ చూడలేదు
  • కౌశిక్ బసుతో మాటల్లో రాహుల్ గాంధీ
1970వ దశకంలో తన నానమ్మ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో అత్యయిక పరిస్థితిని విధించడం ముమ్మాటికీ తప్పేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  వ్యాఖ్యానించారు.

ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసుతో ముచ్చటించిన ఆయన, 1975 నుంచి 1977 మధ్య కాలంలో 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అది తప్పని అంగీకరించారు. ఆ సమయంలో ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వెనక్కు తీసుకున్నారని, ప్రసార మాధ్యమాలపై ఎన్నో నియంత్రణలు అమలయ్యాయని, విపక్ష నేతలను జైళ్లకు కూడా పంపారని రాహుల్ గుర్తు చేసుకున్నారు.

"అది తప్పేనని నేను అనుకుంటున్నాను. అవును... అది ముమ్మాటికీ తప్పే. మా నానమ్మ నాడు అలా తలచుకుని ఉండవచ్చు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ భారత రాజ్యాంగాన్ని ఆక్రమించాలని చూడలేదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే, కాంగ్రెస్ కు ఆ శక్తి కూడా లేదు. మా పార్టీ దానికి అంగీకరించదు కూడా" అని రాహుల్ చెప్పారు.

కాగా, నాడు ఎమర్జెన్సీ సమయంలో ఎంతో మంది ప్రతిపక్ష నేతలను జైళ్లకు తరలించిన సంగతి విదితమే. ప్రస్తుతం పలువురు నేతలు సమయం చిక్కినప్పుడల్లా, కాంగ్రెస్ నేతలను విమర్శించేందుకు ఎమర్జెన్సీ ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. గత సంవత్సరం జూన్ లో హోమ్ మంత్రి అమిత్ షా వరుసగా ట్వీట్లు చేస్తూ, అధికారం కోసం పాకులాడిన ఓ కుటుంబం రాత్రికి రాత్రే దేశాన్ని ఓ జైలుగా మార్చివేసిందని మండిపడ్డారు. ప్రసార మాధ్యమాలు, న్యాయస్థానాలకు కూడా స్వతంత్రత లేకుండా చేశారని ఆరోపించారు.

ఇదిలావుండగా, నాడు ఎమర్జెన్సీ విధించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమా? కాదా? అన్న కేసు విచారణ సుప్రీంకోర్టులో జరుగుతోంది. ఓ మహిళ వేసిన పిటిషన్ ను గత సంవత్సరం డిసెంబర్ లో విచారణకు స్వీకరించిన ధర్మాసనం, ఈ విషయంలో అభిప్రాయం చెప్పాలని కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేసింది.
Rahul Gandhi
Indira Gandhi
Emergency
Koushik Basu

More Telugu News