ఉద్యోగం పేరుతో మహిళతో మంత్రి రాసలీలలు.. కర్ణాటకలో కలకలం రేపుతున్న వీడియో

03-03-2021 Wed 07:29
  • ఉద్యోగం పేరిట లైంగిక అవసరాలకు వాడుకున్నారని ఆరోపణ
  • సీడీని టీవీ చానళ్లకు పంపిన సమాచార హక్కు చట్టం కార్యకర్త
  • తనకు, బాధిత మహిళకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు వేడుకోలు
Karnataka minister Ramesh Jarkiholi calls video fake

ఉద్యోగం పేరుతో ఓ మహిళను లోబరుచుకున్న మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియో ఒకటి కర్ణాటకలో కలకలం రేపుతోంది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన మంత్రి తనను లైంగిక అవసరాలకు వాడుకున్నారని ఆరోపించిన మహిళ.. ఆ ఏకాంత దృశ్యాల వీడియోను సమాచార హక్కు చట్టం కార్యకర్త దినేశ్ కల్లహళ్లికి అందించారు.

 ఆయన ఆ వీడియో సీడీని కొన్ని టీవీ చానళ్లకు పంపించారు. మహిళను మోసగించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని, తనకు, బాధిత మహిళకు రక్షణ కల్పించాలని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్‌పంత్‌ను దినేశ్ కోరారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

తన రాసలీలల వీడియోపై మంత్రి స్పందించారు. ఆ సీడీలో ఉన్నది తాను కాదని, తన ఫొటోలను ఉపయోగించి ఎవరో ఈ సీడీని రూపొందించారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వస్తుందని అన్నారు. కేసును ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మరోవైపు, మంత్రి తప్పు చేసినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పవని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు గత రాత్రి బెంగళూరులో ధర్నా నిర్వహించారు.