ప్రేమించిన యువతి పట్టించుకోవడం లేదని.. హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం

03-03-2021 Wed 06:51
  • పెళ్లి కుదరడంతో యువకుడిని దూరం పెట్టిన యువతి
  • ఇంటికెళ్లి కత్తితో దాడిచేసిన యువకుడు
  • పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు
man attacked on girlfriend with knife for keeping distance

ప్రేమించిన యువతి దూరం పెట్టడంతో రగిలిపోయిన ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హైదరాబాద్‌లోని హైదర్షాకోట్ ప్రాంతంలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే యువతి (29) ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తోంది. అదే ప్రాంతంలో ఓ హెయిర్ కటింగ్ సెలూన్‌లో పనిచేసే హర్యానాకు చెందిన షారూఖ్ సల్మాన్‌ (29)తో ఆమెకు పరిచయం ఉంది. ఇద్దరూ తరచూ కలుసుకుని మాట్లాడుకునేవారు. సల్మాన్ పలుమార్లు యువతితో కలిసి ఆమె ఇంటికి కూడా వెళ్లాడు.

అయితే, సదరు యువతికి ఇటీవల పెళ్లి సంబంధం కుదిరింది. మే నెలలో పెళ్లి కూడా నిశ్చయమైంది. దీంతో యువతి అతడిని దూరం పెట్టింది. దీనిని తట్టుకోలేకపోయిన సల్మాన్ గత రాత్రి ఏడున్నర గంటల సమయంలో యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడికి తెగబడ్డాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కత్తి దాడిలో గాయపడిన యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. యువతికి వీపు భాగంలో గాయాలయ్యాయని, కోలుకుంటోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.