భారీ స్థాయిలో టెలికాం స్పెక్ట్రమ్ ను చేజిక్కించుకున్న రిలయన్స్ జియో

02-03-2021 Tue 22:18
  • ఐదేళ్ల తర్వాత దేశంలో స్పెక్ట్రమ్ వేలం
  • రూ.57,122 కోట్లతో రిలయన్స్ జియో బిడ్డింగ్ లు
  • రూ.18,669 కోట్లకు బిడ్లు దాఖలు చేసిన ఎయిర్ టెల్
  • 4జీ సేవల కోసం స్పెక్ట్రమ్ వేలం
 Reliance Jio bids highest in spectrum auction

టెలికాం రంగంలో భారీ పెట్టుబడులకు వెనుకాడేది లేదని రిలయన్స్ జియో స్పష్టం చేసింది. దేశంలో ఐదేళ్ల తర్వాత టెలికాం స్పెక్ట్రమ్ వేలం నిర్వహించగా రూ.57,122 కోట్లతో రిలయన్స్ జియో అత్యధిక మొత్తంలో బిడ్లు దాఖలు చేసింది. ఈ వేలంలో రూ.3.92 లక్షల కోట్ల విలువ చేసే 2,250 మెగా హెర్జ్ రేడియో తరంగాలను 7 బ్యాండ్లలో అందుబాటులో ఉంచారు. ఈ స్పెక్ట్రమ్ ను టెలికాం సంస్థలు 20 ఏళ్ల పాటు వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో, భారీ మొత్తంలో బిడ్లు దాఖలు చేసిన జియో ఈ బ్యాండ్లలో అత్యధికం కైవసం చేసుకుంది.

జియో తర్వాత స్థానంలో ఎయిర్ టెల్ రూ.18,669 కోట్లకు బిడ్లు దాఖలు చేయగా, వొడాఫోన్-ఐడియా సంస్థ రూ.1,993 కోట్లకు బిడ్లు దాఖలు చేసింది. ఈ బిడ్డింగ్ కేవలం 4జీ సేవలకు మాత్రమే ఉద్దేశించింది. 5జీ సేవలకు 3,300-3,600 మెగాహెర్జ్ బ్యాండ్లను వినియోగించనుండగా, వీటిని వేలం నుంచి మినహాయించారు.