మోదీపై గులాంనబీ ఆజాద్ చేసింది పొగడ్తలు కాదట!

02-03-2021 Tue 21:28
  • ఇటీవల జమ్మూలో మోదీపై ఆజాద్ వ్యాఖ్యలు
  • మోదీ టీ కూడా అమ్మారన్న ఆజాద్ 
  • ఆయన వ్యక్తిత్వాన్ని దాచుకోని నైజం తనకిష్టమని వివరణ
  • ఆజాద్ చేసింది పొగడ్తలు కాదంటున్న సన్నిహిత వర్గాలు
  • త్వరలోనే ఆజాద్ వివరణ ఇస్తారని వెల్లడి
Close sources said Azad did not praise PM Modi

ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ప్రధాని నరేంద్ర మోదీ నిరాడంబరతను, ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. అయితే ఆజాద్ సన్నిహితవర్గాలు మాత్రం ఆ వ్యాఖ్యలు మోదీని పొగుడుతూ చేసినవి కావని అంటున్నాయి. ఆ వ్యాఖ్యలను అందరూ తప్పుగా అర్ధం చేసుకున్నారని, సరైన సమయంలో ఆజాద్ వాటిపై స్పష్టత ఇస్తారని తెలిపాయి. తాను గతంలో టీ అమ్మానని ప్రధాని చెప్పుకుంటుండడాన్ని మాత్రమే ఆజాద్ ప్రస్తావించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఇటీవల గులాంనబీ ఆజాద్ జమ్మూలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, అనేకమంది నేతల్లో తాను పలు అంశాలను ఇష్టపడతానని చెప్పారు. మన ప్రధాని మోదీ కూడా ఓ గ్రామం నుంచి వచ్చినవాడేనని, ఆయన తాను టీ అమ్మానని చెప్పుకుంటుంటారని ఆజాద్ తెలిపారు. తాము రాజకీయ ప్రత్యర్థులమే అయినా, ఆయన తన అంతరంగాన్ని దాచుకోకపోవడాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు.