నిన్న జావేద్ తాతయ్య వారంట్ ఇప్పిస్తే... ఇవాళ రైతు చట్టాలకు మద్దతిచ్చానని మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు: కంగన రనౌత్

02-03-2021 Tue 20:50
  • కంగన వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ పరువునష్టం దావా
  • కంగనపై వారెంట్ జారీ
  • తాజాగా వ్యవసాయ చట్టాలకు మద్దతుగా కంగన వ్యాఖ్యలు
  • ఎఫ్ఐఆర్ నమోదు.. థాంక్స్ అంటూ కంగన వ్యంగ్యం
Kangana tweets her present situation

బాలీవుడ్ అగ్రశ్రేణి నటి కంగన రనౌత్ ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్న కంగన అనేక అంశాలపై న్యాయపోరాటాలు చేస్తున్నారు. తాజాగా ఓ ట్వీట్ ద్వారా తన ప్రస్తుత పరిస్థితిని కంగన వివరించారు. మరొక రోజు, మరొక ఎఫ్ఐఆర్ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

"నిన్న జావేద్ తాతయ్య (గీత రచయిత జావేద్ అక్తర్) మహారాష్ట్ర ప్రభుత్వం చలవతో ఓ వారెంట్ ఇప్పించారు. ఇవాళ వ్యవసాయ చట్టాలకు మద్దతుగా మాట్లాడానని మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ ఈ వ్యవసాయ చట్టాలు, రైతుల మరణాలు అవాస్తవాలు ప్రచారం చేస్తూ, అల్లర్లకు కారణమవుతున్న వారిపై మాత్రం ఎలాంటి చర్యలు లేవు... థాంక్స్!" అంటూ కంగన ట్విటర్ లో స్పందించారు. ఇటీవల కంగన చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ సీనియర్ గీత రచయిత జావేద్ అక్తర్ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.