రణగొణ ధ్వని చేస్తున్న బుల్లెట్ సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో తొక్కించిన ఏపీ పోలీసులు

02-03-2021 Tue 19:14
  • విపరీతమైన ధ్వని పుట్టించే బుల్లెట్ సైలెన్సర్లు
  • స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన జంగారెడ్డిగూడెం పోలీసులు
  • పెద్ద సంఖ్యలో సైలెన్సర్ల స్వాధీనం
  • శబ్దకాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లపై ఉక్కుపాదం
Police crushed heavy noisy silencers with a road roller

బుల్లెట్ మోటార్ సైకిల్ వెళుతుంటే దడదడ దడదడ మంటూ మోత మోగిపోతుంది. ఆ విధమైన బీటింగ్ కోసం ప్రత్యేకమైన సైలెన్సర్లను బిగిస్తుంటారు. అయితే ఈ తరహా సైలెన్సర్లు విపరీతమైన శబ్దకాలుష్యానికి కారణమవుతుండడంతో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం  పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. పట్టణంలో అధిక ధ్వని చేస్తున్న బైకులను గుర్తించి వాటి సైలెన్సర్లను తొలగించారు. వాటన్నింటినీ ఓ రోడ్డు రోలర్ సాయంతో తొక్కించి, మళ్లీ పనికిరాకుండా చేశారు.

గత రెండు వారాలుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు పెద్ద సంఖ్యలో బుల్లెట్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ తరహా సైలెన్సర్లను బుల్లెట్ మోటార్ సైకిళ్లకే కాకుండా, కొన్ని రకాల స్పోర్ట్స్ బైకులకు కూడా వినియోగిస్తుంటారు. వీటిపైనా జంగారెడ్డిగూడెం పోలీసులు ఉక్కుపాదం మోపారు.