ఇదో వింత ధోరణి... తనను తానే పెళ్లి చేసుకున్న అమెరికా అమ్మాయి!

02-03-2021 Tue 18:44
  • అందరినీ ఆశ్చర్యపరిచిన మెగ్ టేలర్ మోరిసన్
  • లవ్ లో ఫెయిలైన అట్లాంటా వాసి
  • జీవితంలో ఆనందాలు ఎందుకు కోల్పోవాలని ప్రశ్నించుకున్న వైనం
  • బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి
US woman married her self after break up with boy friend

అమెరికాకు చెందిన మెగ్ టేలర్ మోరిసన్ అనే యువతి తనను తానే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఎలాంటి ఆచారాలు పాటించాలో అన్నీ పాటించి మరీ తనను తాను వివాహమాడింది.

ఇది లోక విరుద్ధం అయినా, మెగ్ ఆ విధంగా చేయడానికి బలమైన కారణమే ఉంది. అట్లాంటాలో నివసించే మెగ్ కూడా ఓ మంచి కుర్రాడ్ని పెళ్లాడి జీవితంలో స్థిరపడాలని ఎన్నో కలలు కంది. ఈ క్రమంలో ఓ వ్యక్తిని ప్రేమించినా, దురదృష్టవశాత్తు ఆ ప్రేమ విఫలమైంది. ఇద్దరూ విడిపోయారు. ఈ పరిణామం మెగ్ ను తీవ్రంగా కుదిపేసింది.

కానీ, ఇలా ఎంతకాలం అని ఆలోచించిన ఆ అమెరికా అమ్మాయి తన ఆనందాన్ని ఎందుకు కోల్పోవాలని భావించింది. ఈ క్రమంలోనే తనను తానే పెళ్లాడాలని నిర్ణయించుకుంది. ప్రత్యేకంగా పెళ్లి గౌను, వెడ్డింగ్ రింగ్, కేకు అన్నీ ఏర్పాటు చేసుకుని, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అందరినీ ఆహ్వానించింది. పెళ్లి ఉంగరాన్ని తానే పెట్టుకుంది. అంతేకాదు, అద్దంలో తనను తాను ముద్దాడి ఆచారాన్ని పాటించింది. పెళ్లినాటి ప్రమాణాలన్నీ చేసింది. ఈ సందర్భంగా మెగ్ తీవ్ర భావోద్వేగాలకు లోనైంది.  

మొత్తానికి తనను తానే వివాహం చేసుకుని అమెరికా సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ పెళ్లికి రూ.1.02 లక్షలు ఖర్చయ్యాయట. త్వరలోనే హనీమూన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక, భవిష్యత్తులో ఎవరైనా మంచివాడు తారసపడితే అతడితో జీవితం పంచుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని మెగ్ చెబుతోంది. మరోసారి పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధమేనని అంటోంది.