టాలీవుడ్ దర్శకుడు వెంకీ కుడుములను బోల్తా కొట్టించిన సైబర్ నేరగాళ్లు

02-03-2021 Tue 17:43
  • భీష్మ దర్శకుడు వెంకీ కుడుములకు టోకరా
  • మీ చిత్రం ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైందంటూ ఫోన్
  • 6 కేటగిరీల్లో నామినేట్ చేస్తామని వెల్లడి
  • నిజమేనని నమ్మిన దర్శకుడు
  • రూ.66 వేలు అకౌంట్లో వేసిన వైనం
Cyber fraudsters cheats Tollywood director Venky Kudumula

నితిన్ హీరోగా వచ్చిన భీష్మ చిత్రం దర్శకుడు వెంకీ కుడుముల అనూహ్యరీతిలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు. అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి భీష్మ చిత్రాన్ని నామినేట్ చేస్తామంటూ సైబర్ మోసగాళ్లు వెంకీ కుడుములను బురిడీ కొట్టించారు.

త్వరలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో భీష్మ చిత్రాన్ని 6 కేటగిరీల్లో నామినేట్ చేస్తామని దర్శకుడికి ఫోన్ చేశారు. నవీన్ అనే వ్యక్తి పేరుతో ఈ ఫోన్ వచ్చింది. ఫిలిం ఫెస్టివల్ ఎంట్రీ ఫీజు రూ.66 వేలు (ఒక్కో కేటగిరీకి రూ.10,600) అని చెప్పడంతో నిజమే అని నమ్మిన వెంకీ కుడుముల వారు చెప్పిన ఖాతాలో జమ చేశారు. కాసేపటికే ఆ వ్యక్తి మరోసారి ఫోన్ చేసి సాంకేతిక కారణాల వల్ల ఆ నగదు జమ కాలేదని, మరోసారి జమ చేయాలని దర్శకుడికి సూచించాడు.

దాంతో అనుమానం రావడంతో వెంకీ కుడుముల ఈ వ్యవహారంపై నిర్మాతతో మాట్లాడి చెబుతానని బదులిచ్చాడు. అయితే, అవతలి వ్యక్తి.... కనీసం మూడు కేటగిరిల్లో నామినేట్ చేసేందుకు సగం నగదు అయినా పంపించాలని కోరడంతో ఇదేదో మోసంలా ఉందని వెంకీ భావించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది సైబర్ క్రిమినల్స్ పనే అని వెల్లడైంది.