పవన్ ను కలిసిన ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయిపోతున్న బిగ్ బాస్ భామ

02-03-2021 Tue 17:27
  • క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న పవన్
  • సెట్స్ పై పవన్ ను కలిసిన అషూ రెడ్డి
  • పవన్ 2 గంటల సేపు మాట్లాడాడని వెల్లడి
  • వెళ్లేటప్పుడు పవన్ నుంచి లేఖ
  • గతంలో పవన్ పేరును టాటూ వేయించుకున్న అషూ
Bigg Boss fame Ashu Reddy met Pawan Kalyan

బిగ్ బాస్ మూడో సీజన్ లో సందడి చేసిన యూట్యూబ్ భామ అషూ రెడ్డి (అశ్విని) ఇప్పుడు సంతోష సాగరంలో ఓలలాడుతోంది. అందుకు కారణం... అమ్మడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కలవడమే. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ కోసం పవన్ సెట్స్ పై ఉండగా, అక్కడే అషూ రెడ్డి నటిస్తున్న చిత్రం షూటింగ్ కూడా జరుగుతోంది. దాంతో పవన్ ను కలిసేందుకు వెళ్లిన అషూకి ఊహించని పరిణామం ఎదురైంది.

ఏదో కొన్ని నిమిషాలు మాట్లాడి పంపిస్తాడని ఆమె భావించినా, పవన్ ఆమెతో ఏకంగా 2 గంటల పాటు ఆప్యాయంగా ముచ్చటించడం విశేషం. ఈ సందర్భంగా పవన్ తన టాటూ సంగతి ప్రస్తావించాడని చెప్పి అషూ మురిసిపోతోంది. గతంలో తన శరీరంపై పవన్ కల్యాణ్ పేరును ఈ బబ్లీ గాళ్ పచ్చబొట్టు పొడిపించుకున్న సంగతి తెలిసిందే.

ఇక, తాజా మీటింగ్ విషయానికొస్తే పవన్... ఈ భామకు ఓ లెటర్ కూడా అందించాడట. ఆ లెటర్ ను తనే ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. మీరు కోరుకున్నవన్నీ జరగాలని ఆశిస్తున్నాను అంటూ పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు. దాంతో అషూ ఆనందం అంబరాన్నంటుతోంది. పవన్ ను కలవడమే ఓ గోల్డెన్ చాన్స్ అయితే, ఏకంగా రెండు గంటల సేపు అపాయింట్ మెంట్ దొరకడం, పైగా పవర్ స్టార్ స్వయంగా లేఖ ఇవ్వడం అషూని నిలవన్వివడంలేదు.