పవన్ బిజీ బిజీ.. ఒకేరోజు రెండు సినిమాల షూటింగులలో పవర్ స్టార్!

02-03-2021 Tue 16:26
  • ప్రస్తుతం సెట్స్ పై రెండు సినిమాలు 
  • ఉదయం క్రిష్ సినిమా షూటింగ్
  • మధ్యాహ్నం రీమేక్ సినిమా షూట్
  • షాట్ గ్యాప్స్ లో రాజకీయ చర్చలు
Pawan Kalyan participated in two shootings in single day

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పీడు బాగా పెంచేశారు. ఇప్పటికే వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ జోరుమీదున్నారు. ప్రస్తుతం ఆయన 'వకీల్ సాబ్' చిత్రాన్ని పూర్తిచేసి, క్రిష్ సినిమా, 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ సినిమాలతో బిజీగా వున్నారు. మరోపక్క, ఏపీ రాజకీయాలలో కూడా క్రియాశీలకంగా వున్నారు. ఈ క్రమంలో ఒకేరోజు ఆయన ఏకంగా రెండు సినిమాల షూటింగులలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు.  

ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాదు శివారులో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' చిత్రం షూటింగులో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రం షూటింగులో పాల్గొన్నారు.

ఇలా ఒకేరోజు స్టార్ హీరో రెండు సినిమాల షూటింగులలో పాల్గొనడం ఇప్పుడు ఒక విశేషంగా చెప్పుకుంటున్నారు. మరోపక్క, షూటింగు గ్యాప్ లలో ఏపీ మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి జనసేన నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారు.