కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకే పెద్దపీట వేస్తోంది: బోయినపల్లి వినోద్ కుమార్

02-03-2021 Tue 16:24
  • నిర్మలా సీతారామన్ కు వినోద్ లేఖ
  • కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని ఆరోపణ
  • ముద్ర రుణాల అంశంలో వివక్ష తగదని వ్యాఖ్యలు
  • తెలంగాణకు న్యాయం చేయాలని సూచన
Vinod wrote Niramala Seetha Raman

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని పేర్కొన్నారు. కేంద్రం దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలకే పెద్దపీట వేస్తోందని ఆరోపించారు. ముద్ర రుణాల మంజూరులో తెలంగాణ పట్ల వివక్ష సరికాదని హితవు పలికారు.

రాష్ట్రంలో అర్హులైన చిరువ్యాపారులకు, నిరుద్యోగులకు ముద్ర పథకం కింద వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని కోరారు. రుణ లక్ష్యాలను బ్యాంకుల వారీగా అమలు చేయాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన 68 లక్షల మందికి రుణాలు ఇవ్వాల్సి ఉంటే, కేవలం 40.9 లక్షల మందికే ఇచ్చారని వినోద్ వెల్లడించారు. ముద్ర రుణాల్లో తెలంగాణకు న్యాయం చేయాలని వినోద్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.