నిర్మాతగా మారిన 'ఆర్ఆర్ఆర్' కథానాయిక

01-03-2021 Mon 21:45
  • 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్న అలియా భట్ 
  • షారుఖ్ ఖాన్ తో కలసి చిత్ర నిర్మాణం 
  • బ్యానర్ పేరు 'ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్' 
  • టైటిల్ 'డార్లింగ్స్' అంటూ పేర్కొన్న అలియా 
Alia Bhat turns producer

ప్రస్తుతం తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో పాటు హిందీలో పలు సినిమాలు చేస్తూ బిజీగా వున్న బాలీవుడ్ నటి అలియా భట్ కెరీర్ పరంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ 27 ఏళ్ల అందాలభామ ఇప్పుడు నిర్మాతగా మారుతోంది. తన తొలి చిత్రాన్ని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలసి సంయుక్తంగా నిర్మిస్తోంది.

ఎప్పటి నుంచో నిర్మాతగా మారాలన్న కోరికతో వున్న అలియా ఇప్పుడు 'ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్' పేరిట ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పింది. షారుఖ్ ఖాన్ కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ సంస్థతో కలసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'డార్లింగ్స్' అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ విషయాన్ని అలియా భట్ ఈ రోజు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.  

ఇక ఈ డార్లింగ్స్ సినిమాలో అలియాతో పాటు షెఫాలీ షా, రోషన్ మాథ్యూ, విజయ్ వర్మ ముఖ్య పాత్రలు పోషిస్తారు. 2012లో కరణ్ జొహార్ నిర్మించిన 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమా ద్వారా అలియా కథానాయికగా పరిచయం అయింది. అలియా ప్రముఖ ఫిలిం మేకర్ మహేశ్ భట్ కూతురన్న సంగతి విదితమే!