కంగనకు షాకిచ్చిన కోర్టు.. అరెస్ట్ వారెంట్ జారీ!

01-03-2021 Mon 20:36
  • కంగనపై పరువునష్టం దావా వేసిన జావెద్ అఖ్తర్
  • తమ ముందు హాజరు కావాలంటూ కంగనకు ఆదేశం 
  • హాజరు కాని కంగన.. ధిక్కరణగా భావించిన కోర్టు 
Mumbai court issues arrest warrant to Kangana Ranaut

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు ముంబై కోర్టు ఈరోజు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సినీ రచయిత జావెద్ అఖ్తర్ కొన్ని నెలల క్రితం కంగనపై పరువునష్టం దావా వేశారు. గత నెల 1న ఈ కేసును అంధేరీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారించింది.

మార్చి 1వ తేదీలోగా తమ ముందు హాజరు కావాలంటూ కంగనను కోర్టు ఆదేశించింది. ఈరోజుతో కోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. అయినప్పటికీ కోర్టుకు కంగన హాజరు కాలేదు. ఈ చర్యను కోర్టు ధిక్కరణగా భావించిన న్యాయస్థానం కంగనకు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.

మరోవైపు కంగనకు అరెస్ట్ వారెంట్ జారీ కావడంపై ఆమె లాయర్ రిజ్వాన్ సిద్ధికీ మాట్లాడుతూ, కోర్టు ఇచ్చిన ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలను బాంబే హైకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో జావెద్ అఖ్తర్ తరపు లాయర్ స్పందిస్తూ పైకోర్టుకు వెళ్లినప్పటికీ కోర్టు ముందు హాజరు కావడం నుంచి కంగన తప్పించుకోలేరని అన్నారు.