జగన్ పాలనలో రోజుకో చెల్లెమ్మ బలైపోతోంది... ఇది మరో దారుణ ఘటన: నారా లోకేశ్

01-03-2021 Mon 17:15
  • విజయనగరం జిల్లాలో డిగ్రీ విద్యార్థినిపై దాడి
  • కాళ్లు చేతులు కట్టేసి తుప్పల్లో పడేశారన్న లోకేశ్
  • జగన్ బుల్లెట్ లేని గన్ అంటూ వ్యాఖ్యలు
  • అందుకే మృగాళ్లు రెచ్చిపోతున్నారని వెల్లడి
  • నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
Nara Lokesh says another sister ruined in Jagan administration

విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషేన్ కు సమీపంలో ఓ డిగ్రీ యువతిపై దాడి జరిగిందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తెలిపారు. ఆమెపై దాడి చేసి... కాళ్లు చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి తుప్పల్లో పడేశారని, ఈ దారుణ ఘటన తీవ్రంగా కలచివేసిందని అన్నారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని, దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పాలనలో రోజుకో చెల్లెమ్మ బలైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ బుల్లెట్ లేని గన్ అని తెలిసి మృగాళ్లు రెచ్చిపోతున్నారని విమర్శించారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారంటే రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుందని పేర్కొన్నారు.

లేని దిశ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని లోకేశ్ వ్యాఖ్యానించారు.