సుచరిత ఒక బొమ్మ.. జగన్, సజ్జల కీ ఇస్తే ఆ బొమ్మ ఆడుతుంది: టీడీపీ నేత అనిత

01-03-2021 Mon 16:42
  • 20 నెలల రాజారెడ్డి రాజ్యాంగంలో ఎందరో ఆడపిల్లలపై దాడులు జరిగాయి
  • అనూషను హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి
  • అనూష ఘటనపై జగన్ ఎందుకు స్పందించలేదు
Sucharitha is a doll says Anitha

ఏపీ హోంమంత్రి సుచరితపై టీడీపీ నాయకురాలు అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుచరిత కేవలం ఒక బొమ్మ మాత్రమేనని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీ ఇస్తే ఆ బొమ్మ ఆడుతుందని చెప్పారు. 20 నెలల రాజారెడ్డి రాజ్యాంగంలో ఏపీలో ఎందరో ఆడపిల్లలపై అమానుషాలు జరగాయని... ఒక్క ఆడపిల్లను కూడా కాపాడుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు.

గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన అనూషను పాశవికంగా హత్య చేసిన విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని అనిత డిమాండ్ చేశారు. పేరుకు పక్కన రెడ్డి అనే తోక ఉంటే ఏ అరాచకమైనా చేయవచ్చా? అని ప్రశ్నించారు. సాక్షి పేపర్ లో విష్ణువర్ధన్ రెడ్డి పేరులో రెడ్డిని తీసేసి వార్త రాశారని చెప్పారు. దిశా చట్టం ఒక దిక్కుమాలిన చట్టమని... ఒక చట్టాన్ని సక్రమంగా తయారు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని విమర్శించారు.

ఆడపిల్లలకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగన్ ఉంటాడని గొప్పలు చెప్పుకున్నారని... అనూష ఘటనపై జగన్ ఇంత వరకు ఎందుకు స్పందించలేదని అనిత ప్రశ్నించారు. 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడితే జగన్ కు సలాం కొడతామని అన్నారు.