ఇది డోర్ డెలివరీ పథకం కాదు... రోడ్డు డెలివరీ పథకం: తులసిరెడ్డి

01-03-2021 Mon 16:16
  • ఏపీలో ఇంటివద్దకే రేషన్ 
  • ఇదో పిచ్చి తుగ్లక్ పథకం అన్న తులసిరెడ్డి
  • ప్రభుత్వంపై అదనంగా రూ.830 కోట్ల భారం పడుతుందని వెల్లడి
  • ఎవరూ సంతృప్తి చెందడంలేదని వ్యాఖ్యలు
Tulasi Reddy comments on Ration Door Delivery scheme

ఏపీలో ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకం అమలు జరుగుతున్న తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పందించారు. ఇంటింటికీ రేషన్ డెలివరీ ఓ ప్రహసనంలా తయారైందని, కూలి పనులు చేసుకునేవారు రేషన్ వాహనం కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. ఇంటివద్దకే రేషన్ బియ్యం పథకం ఓ తుగ్లక్ పథకంలా తయారైందని... ఇది డోర్ డెలివరీ పథకం కాదని, రోడ్డు డెలివరీ పథకం అని వ్యాఖ్యానించారు.

ఈ పథకం రేషన్ డీలర్లలో అభద్రతా భావాన్ని కలిగిస్తోందని, ఎప్పుడు తమ డీలర్ షిప్ రద్దవుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారని వివరించారు. రేషన్ వాహనదారులు కూడా తెలియక ఇందులో చిక్కుకుపోయామని ఇప్పుడు చింతిస్తున్నారని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై మరోసారి ఆలోచించి గతంలో మాదిరే రేషన్ షాపుల వద్ద బియ్యం ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని హితవు పలికారు. దీని వల్ల ప్రభుత్వంపై రూ.830 కోట్ల మేర అదనపు భారం పడడం తప్ప, ఎవరికీ ప్రయోజనం లేదని అన్నారు. ప్రజలు, డీలర్లు, రేషన్ వాహనం దారులు ఎవరూ సంతృప్తికరంగా లేనప్పుడు పథకం అమలు ఎందుకని ప్రశ్నించారు.