పదో తరగతి అమ్మాయితో రాహుల్ గాంధీ పుషప్ చాలెంజ్... వీడియో ఇదిగో!

01-03-2021 Mon 16:06
  • తమిళనాడులో రాహుల్ ఎన్నికల ప్రచారం
  • తమిళులను ఆకట్టుకునేలా సాగుతున్న రాహుల్
  • ఓ విద్యాసంస్థలో కార్యక్రమం
  • జూడో సాధన చేసే అమ్మాయితో పుషప్స్
  • సింగిల్ హ్యాండ్ తోనూ పుషప్ తీసిన కాంగ్రెస్ అగ్రనేత
Rahul Gandhi push up video went viral

ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కటెముకల పటుత్వం, ఛాతీకండరాల బిగువు కనిపించేలా ఉన్న ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆయన ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ఆ ఫొటోల ద్వారా వెల్లడైంది. తాజాగా తన శారీరక దారుఢ్యాన్ని చాటేలా రాహుల్ గాంధీ ఎంతో వేగంగా పుషప్స్ తీసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాహుల్ స్థానిక ప్రజలతో మమేకం అయ్యేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చాలావరకు సఫలం అవుతున్నారనే చెప్పొచ్చు.

తాజాగా, ఓ కార్యక్రమంలో మెరోలిన్ షేనిఘా అనే 10వ తరగతి అమ్మాయితో కలసి పుషప్స్ చాలెంజ్ లో పాల్గొన్నారు. జూడో మార్షల్ ఆర్ట్స్ సాధన చేసే ఆ బాలిక నిదానంగా పుషప్స్ తీస్తుండగా, రాహుల్ మాత్రం వేగంగా 15 పుషప్స్ పూర్తిచేసి చిద్విలాసం చేశారు. అంతేకాదు, సింగిల్ హ్యాండ్ తోనూ పుషప్ తీసి తన ఫిట్ నెస్ ను ఘనంగా చాటారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.