తృణమూల్ కాంగ్రెస్‌తో ఆర్జేడీ దోస్తీ.. నేడు మమతతో తేజస్వీ యాదవ్ భేటీ!

01-03-2021 Mon 09:25
  • అసోం ఎన్నికల్లో కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్‌తో కలిసి బరిలోకి
  • పశ్చిమ బెంగాల్‌లో పొత్తుపై నేడు మమతతో చర్చ
  • భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామన్న తేజస్వీ
Tejashwi Yadav meet Mamata Banerjee today

బీహార్ వెలుపల సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఇప్పుడు పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికలపై దృష్టిసారించింది. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి అసోం ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇది వరకే ప్రకటించిన ఆ పార్టీ నేత తేజస్వీయాదవ్.. పశ్చిమ బెంగాల్‌‌పైనా ఆసక్తి చూపుతున్నారు. ఆ రాష్ట్రంలోనూ త్వరలో ఎన్నికలు జరగనుండడంతో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌తో జట్టుకట్టాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా నేడు మమతతో తేజస్వీ భేటీ కానున్నారు. నిన్న కోల్‌కతా చేరుకున్న తేజస్వీ యాదవ్ పార్టీ కార్యకర్తలను కలిసి ఎన్నికలపై చర్చించారు. నేడు మమతను కలిసి పొత్తులపై మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. అసోంలో కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్)తో కలిసి ఆర్జేడీ బరిలోకి దిగుతోంది.

బీహార్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో హిందీ మాట్లాడే బీహారీ ప్రజలు ఐదు శాతం వరకు ఉన్నారని తేజస్వీ తెలిపారు. ఈ లెక్కన 11 సీట్లలో తాము పోటీ చేయవచ్చని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నచోట అభ్యర్థులను నిలబెడతామని తేజస్వీ వివరించారు.