చిత్తూరు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన.. టీడీపీ నేతల గృహ నిర్బంధం

01-03-2021 Mon 08:34
  • చిత్తూరులో నేడు టీడీపీ నిరసన కార్యక్రమం
  • పాల్గొననున్న 5 వేల మంది కార్యకర్తలు
  • అనుమతి నిరాకరించిన పోలీసులు
  • చిత్తూరు బయలుదేరిన చంద్రబాబు
Chittoor TDP leaders House arrest amid Chandrababu visit

చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలిలో నేడు టీడీపీ నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 5 వేల మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి టీడీపీ నేతలు పోలీసుల అనుమతి కోరారు.

 అయితే, గత రాత్రి 11.30 గంటల సమయంలో అనుమతి నిరాకరిస్తూ చిత్తూరు పోలీసులు ఉత్తర్వులు ఇచ్చారు. కొవిడ్ నేపథ్యంలో అంతమందితో కార్యక్రమ నిర్వహణకు అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అలాగే, మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉందని, కాబట్టి అనుమతి ఇచ్చేది లేదని డీఎస్పీ స్పష్టం చేశారు.  

మరోవైపు, కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు బయలుదేరారు. 9. 45 గంటలకు ఆయన రేణిగుంట చేరుకుంటారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లాలోని పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో టీడీపీ నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులను పోలీసులు నిర్బంధించారు.