గాలి కొడుతుండగా పేలిన ట్రాక్టర్ టైరు.. ఇద్దరి మృతి

01-03-2021 Mon 08:10
  • శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో ఘటన
  • భారీ శబ్దంతో పేలిన టైరు
  • ఘటనా స్థలంలో ఒకరు, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి
Tractor Tyre Burst Two dead in Srikakulam dist

గాలి కొడుతుండగా పేలిన ట్రాక్టర్ టైరు రెండు ప్రాణాలను బలిగొంది. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండంలోని కొమనాపల్లి గ్రామంలో గత రాత్రి జరిగిందీ  ఘటన. స్థానికుల కథనం ప్రకారం.. దాసరి సూర్యనారాయణ (52) గత 30 సంవత్సరాలుగా కొమనాపల్లి కూడలి వద్ద పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు. అలాగే, సైకిల్ రిపేరింగ్, వాహనాలకు గాలి కొట్టడం వంటివి కూడా చేస్తున్నాడు.

గత రాత్రి దుకాణం మూసివేస్తున్న సమయంలో తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవింద (45) ట్రాక్టర్ టైరు తీసుకొచ్చి పంక్చర్ వేసి గాలి కొట్టమని కోరాడు. మరమ్మతు పూర్తయిన అనంతరం సూర్యనారాయణ గాలి కొడుతుండగా అది ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో సూర్యనాయణ, గోవింద ఇద్దరూ అమాంతం పైకెగిరిపడ్డారు. ఈ ఘటనలో సూర్యనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన గోవిందను శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.