Sandeep Koratala: టాలీవుడ్ నిర్మాత కొరటాల సందీప్ మృతి

Tollywood Producer Sandeep Koratala died with Heart attack
  • నిన్న తెల్లవారుజామున గుండెపోటుతో మృతి
  • స్వగ్రామం పూండ్లలో అంత్యక్రియలు
  • అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నారా రోహిత్
  • అంత్యక్రియల్లో పాల్గొన్న టీడీపీ శ్రేణులు
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగులో పలు సినిమాలు నిర్మించిన కొరటాల సందీప్ (39) నిన్న తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. బాపట్లలోని తన నివాసంలో ఉన్న సందీప్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. కుటుంబం సభ్యులు వెంటనే ఆయనను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. స్వగ్రామమైన పూండ్లలో అంత్యక్రియలు నిర్వహించారు.

సందీప్ చాలా చిన్న వయసులోనే సినీ నిర్మాతగా, టీడీపీ నేతగా గుర్తింపు పొందారు. నారా రోహిత్‌తో ‘రౌడీ ఫెలో’,  నిఖిల్‌తో ‘స్వామి రారా’, 'వీడు తేడా' వంటి సినిమాలు నిర్మించారు. సందీప్ మృతి విషయం తెలిసి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సందీప్ మృతికి నారా రోహిత్, దర్శకుడు సుధీర్ వర్మ సంతాపం తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

నారా రోహిత్ స్పందిస్తూ, సందీప్ ఇక లేరన్న విషయం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ట్వీట్ చేశారు. తన ఆత్మీయ స్నేహితుడు సందీప్ కొరటాల మరణవార్త తనను వేదనకు గురిచేసిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సుధీర్ వర్మ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ‘స్వామిరారా’ షూటింగ్ సెట్‌లో దిగిన ఫొటోను పోస్టు చేశారు.

పలువురు టీడీపీ నాయకులు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు సందీప్‌ మృతదేహంపై పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సందీప్ అంత్యక్రియల్లో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Sandeep Koratala
Tollywood
Heart Attack
Producer

More Telugu News