PCB: తమ క్రికెటర్లకు భారత వీసాలపై ఐసీసీకి లేఖ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు

  • భారత్ లో టీ20 వరల్డ్ కప్
  • వీసాల మంజూరుపై ఐసీసీ హామీ ఇచ్చిందన్న పీసీబీ చైర్మన్
  • బీసీసీఐ నుంచి లిఖితపూర్వక సమాధానం పొందాలని ఐసీసీకి సూచన
  • వీసాలు ఇవ్వలేకపోతే టోర్నీ వేదిక మార్చాలని స్పష్టీకరణ
  • యూఏఈలో నిర్వహించాలని వెల్లడి
PCB wrote ICC amd ask get assurance for Indian visas

ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు లేని పాక్.. ఐసీసీ టోర్నీ కాబట్టి టీ20 వరల్డ్ కప్ లో ఆడేందుకు సిద్ధంగా ఉంది. అయితే తమ ఆటగాళ్లకు భారత వీసాలు జారీ చేసే అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీకి లేఖ రాసింది. ఈ మేరకు పీసీబీ చైర్మన్ ఎహ్ సాన్ మణి వెల్లడించారు. వీసాలపై తమకు ఐసీసీ హామీ ఇచ్చిందని, అయితే ఆ మేరకు బీసీసీఐ నుంచి లిఖిత పూర్వకంగా సమాధానం పొందాలని మణి స్పష్టం చేశారు.

భారత్ లో టోర్నీ జరుగుతున్నందున తమ ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది, అభిమానులు, పాత్రికేయులకు వీసాలు మంజూరయ్యేలా బీసీసీఐ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐసీసీతో సమావేశమై మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని అన్నారు. ఒకవేళ తమకు వీసాలు ఇవ్వలేకపోతే, టోర్నీ వేదికను మరో దేశానికి తరలించాలని ఎహ్ సాన్ మణి స్పష్టం చేశారు.

"వీసాల అంశంపై మార్చి నాటికి స్పష్టత వస్తుందని ఐసీసీ మాకు చెప్పింది. అప్పటిలోగా మాకు హామీ లభించకపోతే టోర్నీ వేదికను మార్చాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ వేదిక యూఏఈ అయితే బాగుంటుందని అనుకుంటున్నాం" అని తెలిపారు.

ఇక, ఆసియా కప్ గురించి చెబుతూ, భారత జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ చేరితే మాత్రం ఆసియాకప్ 2023కి వాయిదా పడుతుందని ఎహ్ సాన్ మణి స్పష్టం చేశారు. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ ఇంగ్లండ్ లోని లార్డ్స్ మైదానంలో జరగనుంది. బిజీ షెడ్యూల్ కారణంగా ఆసియా కప్ టోర్నీ నిర్వహణ సాధ్యపడకపోవచ్చని మణి అభిప్రాయపడ్డారు.

More Telugu News