చైనా లోన్ యాప్ కు బలైన చంద్రమోహన్ కుటుంబానికి కల్వకుంట్ల కవిత బాసట

28-02-2021 Sun 17:29
  • లోన్ యాప్ ల దౌర్జన్యాలతో పలువురి ఆత్మహత్య
  • మేడ్చల్ జిల్లాకు చెందిన చంద్రమోహన్ కూడా బలవన్మరణం
  • దిక్కులేని స్థితిలో కుటుంబం
  • చంద్రమోహన్ కుటుంబ సభ్యులను తన ఇంటికి ఆహ్వానించిన కవిత
  • పిల్లల చదువుల బాధ్యత స్వీకరిస్తానని హామీ
Kalvakuntla Kavitha assures a family to revive

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ ల దాష్టీకాలకు పలువురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిలో మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్ కూడా ఉన్నాడు. చైనా లోన్ యాప్ నుంచి రుణం తీసుకుని తీవ్ర వేధింపులకు గురైన చంద్రమోహన్ జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో అతడి భార్య సరిత, ముగ్గురు కుమార్తెలు దిక్కులేనివారయ్యారు.

అయితే చంద్రమోహన్ కుటుంబం దీనస్థితి గురించి తెలుసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదుకునేందుకు ముందుకువచ్చారు. వారిని తన నివాసానికి ఆహ్వానించారు. సరిత, ఆమె ముగ్గురు కుమార్తెలతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. ముగ్గురు పిల్లలు ఉద్యోగాలు పొందేంత వరకు బాసటగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వారి చదువుల బాధ్యతను తాను స్వీకరిస్తానని తెలిపారు.