బాలుడిని కిడ్నాప్ చేసిన దుండ‌గులు.. ఆచూకీ గుర్తించి తీసుకొచ్చిన పోలీసులు

28-02-2021 Sun 15:08
  • గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలంలో ఘ‌ట‌న‌
  • బాలుడిని కిడ్నాప్ చేసి విక్ర‌యించిన వైనం
  • తూర్పుగోదావ‌రి జిల్లాలో నిందితుల అరెస్టు
police arrests kidnapers

ఓ బాలుడి(2) ని కొంద‌రు కిడ్నాప్ చేశారు.. దీంతో ఆ బాలుడి కుటుంబ స‌భ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా, అత‌డి ఆచూకీని పోలీసులు ఎట్ట‌కేల‌కు గుర్తించారు. చివ‌ర‌కు అత‌డిని తీసుకొచ్చి త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే...  నంబూరు అడ్డరోడ్డు సమీపంలో ఉన్న శివదుర్గ యానాదికాలనీలో ఈ నెల 24న‌ బాలుడు జీవాను కొంద‌రు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ బాలుడి త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, టెక్నాల‌జీని వాడి నిందితుల గురించి వివ‌రాలు సేక‌రించారు.

వారు విజయవాడ వాంబేకాలనీలో ఉన్న‌ట్లు గుర్తించి, అక్క‌డ‌కు వెళ్లి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిని ప్ర‌శ్నించారు. వారు అప్ప‌టికే ఆ బాలుడిని ఇత‌రులకు రూ.1.60 లక్షలకు అమ్మేసిన‌ట్లు తెలుసుకున్నారు.

వారు చెప్పిన వివ‌రాల ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలోని మారుమూల ప్రాంతాల్లో బాలుడు ఉన్న‌ట్లు తెలుసుకున్న పోలీసులు అక్క‌డకు వెళ్లి బాలుడిని క్షేమంగా సొంత గ్రామానికి తీసుకొచ్చారు. నిందితులంద‌రినీ అరెస్టు చేసి, త‌దుప‌రి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.   బాలుడి ఆచూకీని క‌నిపెట్టి, సుర‌క్షితంగా తీసుకువ‌చ్చిన పోలీసులను అధికారులు ప్ర‌శంసించారు.